Megastar Chiranjeevi Speech: ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ ‘హనుమాన్’ థియేటర్ల వివాదం. హైదరాబాద్ నగరం మొత్తమ్మీద కేవలం నాలుగు సింగిల్ స్క్రీన్లు మాత్రమే హనుమాన్‌కు దక్కడంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ థియేటర్ల వివాదంపై కూడా మాట్లాడారు.


‘సంక్రాంతి చాలా మంచి సీజన్. ఎన్ని సినిమాలు వచ్చినా సరే దైవం ఆశీస్సులు ఉండి మన సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. అక్కున చేర్చుకుంటారు. పెద్ద విజయాన్ని అందేలా చేస్తారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ఇది పరీక్షా కాలం అనుకోవచ్చు. కొన్ని థియేటర్లు అనుకున్న విధంగా మనకు లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఈరోజు కాకపోతే రేపు చూస్తారు. రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు. సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. కంటెంట్ బాగుంటే ఎన్నో రోజు చూసినా, ఎన్నో షో చూసినా మార్కులు పడతాయి.’ అని చిరంజీవి ఈ విషయంపై మాట్లాడారు.






మరోవైపు ఈ విషయంలో ఫిలిం ఛాంబర్ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సినిమాలకు థియేటర్లు కేటాయించే విషయంలో ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ చేతుల్లో పెట్టుకుని నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 


సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సినిమాల్లో ‘హనుమాన్’ మినహా ఇతర సినిమాలన్నీ దిల్ రాజు, సునీల్‌కు చెందిన సంస్థలే పంపిణీ చేస్తున్నాయన్నారు. అందుకని ‘హనుమాన్’ సినిమాకు తగినన్ని థియేటర్లు ఇవ్వడం లేదని తెలిపారు. పెద్ద సినిమా అయిన ‘హనుమాన్’ను కావాలనే వారు టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. స్వార్థాన్ని పక్కన పెట్టి ఫిలిం ఛాంబర్ పెద్దలు అన్ని సినిమాలకు థియేటర్లను ఇవ్వాలని తెలిపారు. ‘‘ఈగల్’ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంది. అది నిర్మాతల ఇష్టం. కానీ ‘హనుమాన్’ సినిమాకి కావాల్సిన థియేటర్లను ఇవ్వాలి. ఈ సినిమా కూడా ఎక్కువ బడ్జెట్‌తోనే తీశారు. ‘హనుమాన్’ సినిమాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం థియేటర్లు సరిగా కేటాయించలేదని ‘హనుమాన్’ నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్స్‌ ను బట్టి కాకుండా సినిమాల క్రేజ్‌ను బట్టి థియేటర్స్ ఇవ్వాలి. నేను పెద్ద సినిమాలకు వ్యతిరేకిని కాదు. కానీ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటాను. చిన్న సినిమాల‌ నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అండగా నిలవాలి. ‘హనుమాన్’కు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి.’ అని నట్టి కుమార్ పేర్కొన్నారు.