KTR visits Borabanda for Daawat: హైదరాబాద్: బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంటికి భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వెళ్లారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ మాజీ మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా జనవరి రెండవ తేదీన శుభాకాంక్షలు తెలియజేశారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని ఇబ్రహీం ఖాన్ పేర్కొన్నారు.


కేటీఆర్ ను దావత్‌కు ఆహ్వానించిన ఇబ్రహీం ఖాన్ 
మొదటి ఐదు సంవత్సరాల కాలం ఒక సినిమాలో ఇంటర్వెల్ మాదిరి గడిచిపోతుందని ఇబ్రహీం ఖాన్ అన్నారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతిగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని కేటీఆర్ ను ఇబ్రహీం ఖాన్ ఆహ్వానించాడు. ఆయన ఎవరంటే నగరంలోని బోరబండలో గాజుల దుకాణం నడిపుతున్నాడు ఇబ్రహీం ఖాన్. న్యూ ఇయర్ విషెస్ చెబుతూనే తన ఇంటికి విచ్చేయాలని కేటీఆర్ కి తన ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి వస్తారని ఆకాంక్షిస్తున్నట్లు రాసుకొచ్చారు.


ఇబ్రహీం ఖాన్ ఇంటికి వస్తానని మాట ఇచ్చారు కేటీఆర్ 
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీం ఖాన్ కు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. తనకు అందించిన ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీం ఖాన్ ఇంటికి వస్తానని మాట ఇచ్చారు కేటీఆర్. ఇచ్చిన మాట మేరకు ఆదివారం (జనవరి 7న) బోరబండలోని ఇబ్రహీం ఖాన్ ఇంటికి కేటీఆర్ వెళ్లారు. ఆయన ఇంటికి వెళ్లిన కేటీఆర్ కు ఇబ్రహీం ఖాన్ సాదరంగా కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇబ్రహీం ఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. దివ్యాంగులైన తన పిల్లలకు ఆసరా పెన్షన్ అందించాల్సిందిగా గతంలో ట్విట్టర్లో విజ్ఞప్తి చేస్తే వెంటనే కేటీఆర్ కార్యాలయం స్పందించి పింఛన్ మంజూరు చేయించిన విషయాన్ని కేటీఆర్ కి ఇబ్రహీం ఖాన్ తెలిపారు. 


ఇబ్రహీం ఖాన్ ఇంట్లో ఆతిథ్యం సందర్భంగా ఆ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు చిరు వ్యాపారి కుటుంబానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీం ఖాన్ పిల్లలకు చెవుడు ఉన్నందున వారికి అవసరమైన చికిత్స ఖర్చులు అందించేందుకు కేటీఆర్ ముందుకు వచ్చారు. ఒక సాధారణ పౌరుడు తమ ప్రభుత్వ సేవలకు గుర్తింపుగా తన ఇంటికి ఆహ్వానించడం అత్యంత సంతోషాన్ని ఇచ్చిందన్నారు కేటీఆర్. ప్రజా జీవితంలో ఇలాంటి సంఘటనలు మరింత నిబద్ధతతో ప్రజల కోసం కష్టపడేలా స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ వెంట స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) ఉన్నారు. కేటీఆర్ బోరబండకి రావడంతో వందల మంది ప్రజలు, అభిమానులు పార్టీ కార్యకర్తలు ఇబ్రహీంఖాన్ ఇంటి వద్ద గుమికూడారు. ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ బోరబండకు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


Also Read: ఏపీ, తెలంగాణ పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించిన ఏఐసీసీ