'జాతిరత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ అందించిన కథతో 'ఫస్ట్ డే ఫస్ట్ షో' (First Day First Show Movie) అనే సినిమా రూపొందుతోంది. దీనికి ఇద్దరు యువకులు.. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. 'సిరి సిరి మువ్వ', 'శంకరాభరణం', 'సాగర సంగమం' వంటి చిత్రాలు నిర్మించిన పూర్ణోదయా పిక్చర్స్ ఏడిద నాగేశ్వరరావు వారసులు ఈ సినిమాకు నిర్మాతలు. శ్రీజ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, మిత్రవింద మూవీస్ పతాకంపై శ్రీరామ్ ఏడిద సమర్పణలో శ్రీజ ఏడిద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. 


దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దానికి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పది. నేను ఇక్కడే ఎదిగాను. మధ్యలో వేరే రంగానికి వెళ్లాను. మళ్లీ తిరిగి ఇక్కడికి వచ్చాక దీని వాల్యూ మరింత తెలిసింది. ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. దానికి పట్టుదల ఉండాలి. గ్రాంటెడ్ గా తీసుకుంటే ఇండస్ట్రీ కూడా మనల్ని అలానే లైట్ తీసుకుంటుంది. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ రావాలి. అందుకే నేను యంగ్ స్టర్స్ ని సపోర్ట్ చేస్తూ ఉంటాను. చిరంజీవి స్టేచర్ కి చిన్న సినిమాలకు గెస్ట్ గా రావడమేంటని అనుకుంటారు. కానీ ఎవరైనా నన్ను గెస్ట్ గా పిలిస్తే కచ్చితంగా వెళ్తాను. వాళ్ల స్థాయికి దగ్గరగా నేను ఉండడం నాకు సంతోషాన్నిస్తుంది. అయితే కథలను సెలెక్ట్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. సినిమాలో సరైన కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. దర్శకుడు సినిమా సరిగ్గా తీయకపోతే చాలా మంది జీవితాలు తలకిందులవుతాయి. భారీ తారాగణం, హిట్ కాంబినేషన్స్ దొరికాయని సినిమా తీయొద్దు. కథ బాగుంటేనే  సినిమాలు చూస్తారు.. లేదంటే రెండో రోజే పోతుంది. ఈ మధ్యకాలంలో ఆ బాధితుల్లో నేను కూడా ఒకడిని(ఆచార్యను ఉద్దేశిస్తూ)'' అంటూ చెప్పుకొచ్చారు. ఇదే వేదికపై పవన్ కళ్యాణ్‌కు అడ్వాన్స్‌గా బర్త్ డే విషెస్ చెప్పారు మెగాస్టార్. 


ఈ సినిమాలో తనికెళ్ల భరణి(Thanikella Bharani) హీరో తండ్రిగా నటిస్తే శ్రీకాంత్ రెడ్డి, సంచిత జంటగా నటించారు. ఇతర పాత్రల్లో శ్రీనివాసరెడ్డి మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివీఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా నటించారు. 'ఫస్ట్ డే ఫస్ట్ షో'కు కేవీ అనుదీప్ కథ అందించడంతో పాటు కళ్యాణ్, వంశీధర్ గౌడ్ తో కలిసి స్క్రీన్ ప్లే అందించారు. వంశీధర్ గౌడ్, ఆయన మాటలు రాశారు.


Also Read : సుమన్ బతికుండగా చంపేసిన యూట్యూబ్ ఛానళ్లు


Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ