మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ మూవీ సక్సెస్‌‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఈ మూవీ విడుదలకు ముందు ఆయన కొన్ని యూట్యూబ్ చానళ్లతో తొలిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నాయంటూ వస్తున్న వార్తలకు ఆయన పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తనదైన శైలిలో కూల్‌గా ఆ రూమర్స్‌కు తెరదించారు. 


పదే పదే నాన్న పేరు చెప్పుకుంటే చరణ్‌ను తిట్టుకుంటారు: చిరంజీవి


మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నాయంటూ వార్తలు వస్తున్నాయని, దానిపై మీరేమంటారని యాంకర్ అడిగిన ప్రశ్నకు చిరంజీవి ఇలా బదులిచ్చారు. ‘‘ఈ రోజు (జనవరి 10) అల్లు అరవింద్ పుట్టిన రోజు. ఈ ఇంటర్వ్యూ అవ్వగానే నేను సురేఖ ఫ్లవర్ బొకే తీసుకుని ఆయన్ని విష్ చేసేసి, వీలైతే అక్కడే లంచ్ చేసేసి ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇది చాలు మీ ప్రశ్నకు సమాధానంగా. క్రిస్మస్ రోజున ఇదే ఇంటికి బన్నీ, చరణ్‌లు వచ్చారు. కజిన్స్ అంతా వచ్చి సరదాగా గడిపారు. అయితే, ప్రొఫెషనల్‌గా వచ్చేసరికి ఎవరి ఎదుగుదల వారిది. ఆర్టిస్టుగా ముందుకు వెళ్లాలని ప్రయత్నించడంలో తప్పులేదు. వరుణ్, సాయి ధరమ్ తేజ్‌లు గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటే.. మనం వెళ్లనివ్వాలి. ఈ జర్నీలో వారు మెగా ఫ్యామిలీ గురించి ప్రస్తావిస్తారు. కానీ, చరణ్ మా నాన్న చిరంజీవి అని పది సార్లు చెప్పుకుంటే వినేవాళ్లకు బోరు కొడుతుంది. ఆపవయ్య.. ఎప్పుడూ నీ నాన్న సుత్తేస్తావని చరణ్‌ను తిట్టుకుంటారు. చరణ్ నా పేరు ప్రస్తావించకపోతే.. మా మధ్య విభేదాలు ఉన్నట్లు కాదు కదా? అలా అనుకోవడం కూడా చాలా పొరపాటు. పబ్లిక్ ఫంక్షన్లలో పదే పదే ఒకరినొకరు స్తుతించుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది’’ అని తెలిపారు. 


విభేదాల వల్లే ‘ఆహా’లో బాలకృష్ణకు ప్రాధాన్యమిచ్చారా?


మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్న విభేదాల వల్లే ‘ఆహా’ ఓటీటీలోని ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోకు హోస్ట్‌గా బాలకృష్ణను ఎంపిక చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయని, దీనిపై మీరేమంటారనే ప్రశ్నకు చిరంజీవి బదులిస్తూ.. ‘‘ఆహా.. అందరిది. ఆ షోకు నన్ను అడగలేదు. ఎందుకంటే.. నేను బిజీగా ఉంటానని వారికి తెలుసు. బాలయ్యను ఆ షోలో పెట్టుకున్నారని, అరవింద్‌కు నాకు ఏదో ఉందని అనుకోవడం తప్పు’’ అని అన్నారు. అల్లు అర్జున్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘ఎవరికి వారు బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకోడానికి ప్రయత్నాలు చేయడం తప్పు కాదు. బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు చేయి పట్టి నడిపించవచ్చు. పరుగులు పెట్టే స్థాయికి వచ్చినప్పుడు.. ఉండరాబాబు నేను కూడా వస్తా అని చెయ్యి పట్టుకోకూడదు. వారిని అలా వదిలేయాలి. వాళ్లు పని చేసుకుంటూ వెళ్లిపోతారు. దట్స్ మై కిడ్ అనుకుంటూ.. వారిని చూసి ఆనందించాలి’’ అని అన్నారు. 



Read Also: మల్టీఫ్లెక్స్‌లో రూ.99కే సినిమా చూడొచ్చు, ఆ ఒక్కరోజే అవకాశం మిస్ చేసుకోకండి!