కూతురు పుట్టిన అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ దంప‌తుల‌కు జూన్ 20వ తేదీన పాప పుట్టిన సంగ‌తి తెలిసిందే. తల్లి, బిడ్డ ఇద్దరూ అపోలో డాక్టర్ల ప‌ర్యవేక్ష‌ణ‌లోనే ఉన్నారు. పాప పుట్టిన మూడో రోజున అంటే జూన్ 23వ తేదీన ఉపాస‌న హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొయినాబాద్‌లో ఉన్న త‌న త‌ల్లి ఇంటికి బ‌య‌లుదేరారు. ఈ సంద‌ర్భంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ ప్రెస్‌మీట్‌లో రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ. ‘జూన్ 20వ తేదీన తెల్లవారు జామున పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఉపాస‌న‌, పాప ఇద్దరూ రిక‌వ‌ర్ కావ‌టంతో హాస్పిట‌ల్ నుంచి ఇంటికి వెళుతున్నాం. డాక్ట‌ర్ సుమ‌న‌, డాక్ట‌ర్ రుమ, డాక్ట‌ర్ ల‌త‌, డాక్ట‌ర్ సుబ్బారెడ్డి, డాక్ట‌ర్ అమితా ఇంద్ర‌సేన‌, తేజ‌స్వి స‌హా అపోలో టీమ్‌కి అందరికీ థాంక్స్‌. వీరంతా చాలా బాగా చూసుకున్నారు. మేమెంతో అదృష్టవంతులం. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. పాప, ఉపాస‌న‌ ఇద్ద‌రూ క్షేమంగా  ఉన్నారు.’

‘మంచి డాక్టర్స్ టీమ్ ఉన్నారు కాబ‌ట్టి మాకు ఎలాంటి భ‌యం కలగలేదు. మా అభిమానుల ప్రార్థ‌న‌లు, వాళ్లు చేసిన పూజలు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అభిమానులను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. వాళ్ల ద‌గ్గ‌ర నుంచి ఇంత‌క‌న్నా అడుగుతాను. అలాగే అన్ని దేశాల నుంచి మా శ్రేయోభిలాషులు, ఇత‌రులు కూడా ఆశీస్సులు అందించారు.  మీడియా మిత్రులంద‌రికీ ఈ సందర్భంగా థాంక్స్‌. మీరు అందించిన ఆశీర్వాదాలు మా పాప‌కు ఎప్పుడూ ఉంటాయి. ఇంత మ‌ధుర క్ష‌ణాల‌ను నా జీవితంలో మ‌ర‌చిపోలేను. మీ అభిమానం చూస్తుంటే నాకు నోటి నుంచి మాట‌లు రావ‌టం లేదు. మా పాప‌కు కూడా ఈ అభిమానం ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’

ఇంకా మాట్లాడుతూ... ‘21వ రోజు పాప‌కు పేరు పెడ‌దామ‌ని అనుకుంటున్నాం. నేను, ఉపాస‌న పాపకు ఒక పేరు అనుకున్నాం. త‌ప్ప‌కుండా అది మీ అంద‌రికీ కూడా తెలియ‌జేస్తాను. చాలా సంవ‌త్స‌రాలుగా మేం ఎదురు చూస్తున్న స‌మ‌యం ఇది. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు మాకు దొరికాయి. నాకు ఇప్పుడు చెప్ప‌లేనంత ఆనందంగా ఉంది. మ‌ళ్లీ  అంద‌రికీ ధన్యవాదాలు.’ అని అన్నారు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టిన రోజున మెగాస్టార్ చిరంజీవి మీడియా ముందుకు వచ్చారు. మెగా స్టార్ ఆంజనేయ స్వామి భక్తుడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన రోజు మంగళవారం. ఆ రోజున అమ్మాయి పుట్టడంతో మెగాస్టార్ మరింత సంబరపడ్డారు. పట్టలేనంత ఆనందం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ విజయాలు, వరుణ్ తేజ్ నిశ్చితార్థం, మనవరాలు పుట్టడం... తమ ఇంట అన్నీ శుభకార్యాలు జరుగుతున్నాయని సంతోషపడుతూ తెలిపారు.

Read Also : Pawan Kalyan: ఆ హీరోల పాన్ ఇండియా సక్సెస్ పట్ల పవన్ కళ్యాణ్ చాలా అసూయతో ఉన్నారు - సినీ క్రిటిక్ తీవ్ర వ్యాఖ్యలు