మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా ‘మెగా 154’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ టైటిల్ టీజర్ ను రేపు (అక్టోబర్ 24న) విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ టీజర్ రిలీజ్ అవుతుందని తెలిపింది. తాజాగా ఈ ప్రకటనకు సంబంధించి విడుదల చేసిన వీడియోలో ‘గెట్ రెడీ ఫర్ ది మాస్ ఎక్స్ ప్లోజన్’ అంటూ మాస్ లుక్ తో చిరంజీవి బీడీని నోట్లోకి పెట్టుకునే దృశ్యాన్ని వదిలింది. ”దీపావళి మాస్ ఎక్స్ ప్లోజన్ తో మొదలవుతుంది. మెగా 154 టైటిల్ టీజర్ రేపు ఉదయం 11.07 గంటలకు విడుదలవుతుంది. 'మాస్ మూలవిరాట్'కి స్వాగతం పలుకుదాం” అంటూ మైత్రి మూవీ మేకర్స్ తెలిపింది.
తుది దశకు చేరిన షూటింగ్
ప్రస్తుతం మెగా 154కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా కొనసాగుతుంది. యాక్షన్ సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. అటు ఊర మాస్ హీరో రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కొన్ని పాటలు, కొంత టాకీ పార్ట్ మినహా మిగతా సినిమా అంతా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తున్నది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ వైజాగ్ రంగరాజుగా కనిపించబోతున్నారట. అటు ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ఖరారు అయినట్లు టాక్ నడుస్తోంది. రేపటితో ఈ ఊహగానాలకు చెక్ పడనుంది.
సంక్రాంతి బరిలో మెగా154!
ఇక చిరంజీవి, మాస్ మహరాజ్ రవితేజ కలిసి నటిస్తున్న ఈ తాజా సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఆ దిశగానే దర్శక నిర్మాతలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవ పక్కన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నది. ఈ సినిమాకు బాబీ కథతో పాటు మాటలు అందించారు. కోన వెంకట్, కె.చక్రవర్తిరెడ్డి కలిసి స్క్రీన్ ప్లే రూపొందించారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జీకే మోహన్ సహ నిర్మాతగా ఉన్నారు. మెగాస్టార్ సినిమాలకు ఎక్కువగా సంగీతం అందించే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్థర్ విల్సన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా కొనసాగుతున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తున్నారు.
Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్