Mayapetika Trailer: మనిషి జీవితంలో సెల్ ఫోన్ కూడా ఒక భాగమైపోయింది. ఏం చేసినా అన్నీ సెల్ ఫోన్ లోనే చేస్తున్నారు. అంతలా సెల్ ఫోన్ మనిషిని అతుక్కుపోయింది. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి దగ్గరా ఓ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అలాంటిది సెల్ ఫోన్ కే ఓ కథ ఉంటే. దాని మీద కొంత మంది జీవితాలు ఆధారపడి ఉంటే ఎలా ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ తోనే ‘మాయా పేటిక’ అనే ఓ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు రమేష్ రాపర్థి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ బయటకొచ్చింది. మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 


ఇంప్రెసివ్ గా ‘మాయ పేటిక’ ట్రైలర్..


‘మాయా పేటిక’ ట్రైలను విషయానికొస్తే.. సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే ఈ మూవీ కథ అంతా ఓ సెల్ ఫోన్ చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. ప్రపంచంలో మనిషికి నాలుగు అవసరాలు ఉంటాయి అవి ప్రేమ, అధికారం, డబ్బు వీటితో పాటు మనిషికి తప్పని నాలుగో అవసరంలా సెల్ ఫోన్ తయారైంది. ట్రైలర్ ప్రారంభంలో కూడా ఇదే డైలాగ్ ను పెట్టారు. సినిమాలో కూడా వీటి చుట్టూ తిరిగే పాత్రలే కనిపిస్తున్నాయి. వాళ్లందరి జీవితాలు ఒక సెల్ ఫోన్ మీద ఆధారపడి ఉంటాయి. సినిమాలో ఉండే ప్రతీ పాత్ర ఆ ఫోన్ కు లింక్ అయ్యే ఉంటుంది. అసలు ఆ ఫోన్ లో ఏముంది? అది ఒక్కొక్కరి జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? సెల్ ఫోన్ వల్ల ఎవరు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు, ఎలా బయటపడ్డారు అనేది సినిమాలో చూడొచ్చు. ట్రైలర్ ను మంచి విజువల్స్ తో సౌండ్ ఎఫెక్ట్స్ తో ఆసక్తిరేపేలా కట్ చేశారు. మరి మూవీ ఎలా ఉంటుంది అనే తెలియాలి అంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.



సెల్ ఫోన్ సెంట్రిక్ థ్రిల్లర్ మూవీతో పాయల్..


‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో మంచి హిట్ అందుకుంది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసింది. అయితే అమ్మడుకి సరైన హిట్ అందలేదు. ఇప్పటికీ హిట్ కోసం ఎదురు చూస్తోంది ఈ బ్యూటీ. గతేడాది ‘జిన్నా’ మూవీ పర్వాలేదనిపించినా హిట్ టాక్ ను తెచ్చుకోలేదు. అయినా వరుస మూవీ అవకాశాలు వస్తున్నాయి. ఈసారి ఈ సెల్ ఫోన్ సెంట్రిక్ థ్రిల్లర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పాయల్. అయితే ఈ సినిమాలో పాయల్ పాత్ర ఎలా ఉంటుంది అనేది చూడాలి. అలాగే మూవీలో హిమజ, పృధ్వీ రాజ్, జగదీష్ ప్రతాప్, శ్యామల లాంటి నటులు కూడా కనిపిస్తున్నారు. ఈ మూవీకు గుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గుణ బాల సుబ్ర‌మ‌ణ్యం సంగీతాన్ని స‌మ‌కూరుస్తుండ‌గా సురేష్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ గా చేశారు. ఈ మూవీ జూన్ 30 ప్రేక్షకుల ముందుకు రానుంది.