టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అనతి కాలంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ గత కొంతకాలంగా వరుస అపజయాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రయోగాత్మక సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరోసారి గతంలో చేసిన ప్రయోగమే చేయబోతుందట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. గతంలో లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ చేసి ఫెయిల్యూర్స్ అందుకున్న కీర్తి సురేష్, తాజాగా మరో లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగులో 'నేను శైలజ' అనే సినిమాతో హీరోయిన్ గా ఆరంగేట్రం చేసిన కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచింది. ఆమె నటనకి యావత్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలా మహానటితో స్టార్ హీరోయిన్గా మారిన కీర్తి సురేష్ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.


అయితే హీరోయిన్ గా తన సక్సెస్ ని కొనసాగిస్తున్న సమయంలోనే పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేసింది కీర్తి సురేష్. తమిళంతో పాటు తెలుగులోనూ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ టైంలో కీర్తి సురేష్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఓటిటిలో సందడి చేశాయి. 'పెంగ్విన్', 'మిస్ ఇండియా', 'గుడ్ లక్ సఖి' ఈ మూడు లేడీ ఓరియంటెడ్  సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాయి. దాంతో కీర్తి సురేష్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం మానేస్తే బాగుంటుందని చాలామంది బహిరంగంగానే చెప్పారు. అయినా కూడా ఇప్పుడు మరోసారి లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. అంతేకాదు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారట. నూతన దర్శకుడు తెరకెక్కించబోయే ఈ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ ఆగస్టులో సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.


మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టులో యంగ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాడట. రీసెంట్ గానే 'రైటర్ పద్మభూషణ్' సినిమాతో మంచి హిట్ అందుకున్న సుహాస్ ఇప్పుడు కీర్తి సురేష్ నటించనున్న ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తూ ఉండడం విశేషం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. మరి ఈ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ తోనైనా కీర్తి సురేష్ సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి. ఇక రీసెంట్ గా 'దసరా' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంకర్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలుగా కనిపించనుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం' అనే సినిమాకి అఫీషియల్ రీమేగా రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది.


Also Read: కూతురు వయస్సుతో అమ్మాయితో లిప్ లాకా? ఆ నటుడిపై నెటిజన్ల విమర్శలు