ఐటమ్ సాంగ్ అంటే ప్రేక్షకుల్లో ఉండే కిక్కే వేరు. అందుకనే, అందరూ తమ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. లేటెస్టుగా ఈ రోజు మరో ఐటమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. 'సిలకా... సిలికా... రామా సిలకా... ఏదో ఉందే మెలికా' అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఇండియన్ ఐడల్ రేవంత్ ఆలపించారు. 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాలో 'మనోహరి...' తర్వాత ఆయన పాడిన ఐటమ్ సాంగ్ ఇదే. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాట 'టెన్త్ క్లాస్ డైరీస్' సినిమాలోనిది.


అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం 'టెన్త్ క్లాస్ డైరీస్' చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి అజయ్ మైసూర్ సమర్పకులు. శనివారం సాయంత్రం 'సిలకా... సిలకా... రామా సిలకా...' పాటను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు.


నిర్మాతల్లో ఒకరైన అచ్యుత రామారావు మాట్లాడుతూ "నిర్మాతగా గతంలో 'రోజ్ విల్లా', 'ముగ్గురు మొనగాళ్లు' చేశాను. రెండూ నాకు సంతోషాన్ని ఇచ్చారు. ఆ రెండు సినిమాలకు అమెజాన్‌లో టాప్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు కమర్షియల్ హంగులతో 'టెన్త్ క్లాస్ డైరీస్' తీశాం. సరికొత్త కాన్సెప్ట్‌తో పదో తరగతి చదివిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాం. అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు... ఎన్ని చేసినా, మన జీవితాల్లో పదో తరగతి అనేది మైలు రాయి లాంటిది. పదో తరగతి జ్ఞాపకాలు మన జీవితం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపిస్తాయి. ఆ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా తెరకెక్కించిన మంచి కామెడీ ఎంటర్టైనర్ ఇది" అని తెలిపారు.





"సినిమాలోని ప్రధాన తారాగణంతో పాటు 150 మంది జూనియర్ ఆర్టిస్టులు, 30 మంది డాన్సర్లపై 'సిలకా... సిలకా... రామా సిలకా'ను తెరకెక్కించాం. టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాటకు నృత్య రీతులు సమకూర్చారు. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ సినిమా. ఈ నెల 26న టీజర్ విడుదల చేస్తాం" అని దర్శకుడు 'గరుడవేగ' అంజి చెప్పారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఆయ‌న 50వ చిత్ర‌మిది. శ్రీనివాసరెడ్డి, 'వెన్నెల' రామారావు, అర్చన (వేద), హిమజ, శివ బాలాజీ, మధుమిత, 'సత్యం' రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయి రామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ : రామారావు, కథనం - మాటలు : శ్రుతిక్, పాటలు : చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, నేపథ్య సంగీతం: ఎస్. చిన్నా, స్వరాలు: సురేష్ బొబ్బిలి, సహ నిర్మాత: రవి కొల్లిపర, సమర్పణ: అజయ్ మైసూర్. 


Also Read: ప్ర‌భాస్‌తో సినిమా... కాదని చెప్పలేదు! అలాగని, కన్ఫర్మ్ చేయలేదు!
Also Read: AAGMC Teaser: దర్శకుడిగా సుధీర్ బాబు... డాక్ట‌ర్‌గా కృతి శెట్టి! ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే?
Also Read: కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ బాబు.. రమేష్ బాబు పిల్లలను చూసి భావోద్వేగం
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి