గోపీచంద్ తో 'పక్కా కమర్షియల్' సినిమా చేసిన మారుతి ప్రస్తుతం ఆ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. నిన్ననే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు మారుతి. ఈ క్రమంలో ప్రభాస్ తో చేయబోయే సినిమా గురించి మాట్లాడారాయన. ప్రభాస్ తో ఎలాంటి సినిమా సినిమా చేయాలనుకుంటున్నారు..? 'రాజా డీలక్స్' అనే టైటిల్ ఫిక్స్ చేశారా..? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పారు మారుతి. 


ప్రభాస్ తో సినిమా ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది అంటూ వాళ్లే మాట్లాడేసుకుంటున్నారని.. సినిమా కూడా వాళ్లే తీస్తారేమో అంటూ వెటకారంగా కామెంట్ చేశారు. ప్రభాస్ ని ఎలా చూపించాలో తనకి క్లారిటీ ఉందని.. అలానే చూపించే ప్రయత్నం చేస్తానని అన్నారు. తను ఎలాంటి సినిమా చేయగలనో అందరికీ తెలుసని, తన జోనర్, కామెడీ నచ్చే అప్రోచ్ అవుతారని అన్నారు. 


తన మార్క్ లోనే సినిమా చేస్తానని అన్నారు. దీనికొక ఉదాహరణ కూడా చెప్పారు. 'మనం నాటుకోడి బాగా వండుతామని తెలిసి మనల్ని పిలిచినప్పుడు మనకి వచ్చిన వంటే చేసి పెట్టాలి తప్ప మనకి రాని చైనీస్ మరొకటి వండకూడదు' అంటూ చెప్పుకొచ్చారు. మారుతి మాటలను బట్టి ప్రభాస్ తో తన మార్క్ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసే ఛాన్స్ ఉంది. 


ప్రస్తుతానికి ప్రభాస్-మారుతి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను ఇంకా లాక్ చేయలేదు. కొందరు రచయితలతో మారుతి స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ కి ఫైనల్ నేరేషన్ ఇచ్చి ప్రాజెక్ట్ లాక్ చేయనున్నారు మారుతి. అయితే ఈ సినిమా ఉంటుందా..? లేదా..? అనేది మాత్రం 'పక్కా కమర్షియల్' సినిమా రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వస్తే గనుక ప్రభాస్ తో ప్రాజెక్ట్ మరింత డిలే అవ్వడం ఖాయం!