Manisha Koirala: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో మనీషా కొయిరాలా ఒకరు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. దక్షిణాదిలోనూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికీ అదే గ్లామర్ తో సినిమాల్లో దూసుకుపోతుంది. మనీషాకు దక్షిణాదిలో గుర్తింపు ఉన్నా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. బాలీవుడ్ లో వచ్చినంత పేరు ఆమెకు దక్షిణాదిలో రాలేదు. అయితే ఇక్కడ కొన్ని సినిమాలు చేసినా అవి అంతగా ఆకట్టుకోలేదు. కానీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘బొంబాయి’ వంటి సినిమాలతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది మనీషా. ఈ సినిమాతో తెలుగులోనూ మంచి పేరు సొంతం చేసుకుంది. అయితే ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ‘బొంబాయి’ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది మనీషా. ప్రస్తుతం మనీషా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన ‘బొంబాయి’ సినిమా ఎంత పెద్ద హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో నటించారు. 1995లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోడమే కాకుండా ఎన్నో అవార్డులు అందుకుంది. ఈ సినిమాలో నటించిన వారికీ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అయితే సినిమా చిత్రీకరణకు ముందు ‘బొంబాయి’ సినిమాలో నటించడానికి మనీషా కొయిరాలా ముందు అంగీకరించలేదట. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తన సన్నిహితులు కూడా కొంత మంది తల్లి పాత్ర చేయొద్దని చెప్పారట. దీంతో ఆ సినిమాలో తల్లి పాత్రపై ఆమెకు అనుమానం వచ్చిందట. అందుకే సినిమాను చేయకూడదు అనుకున్నానని చెప్పింది మనీషా. అయితే ఈ విషయం సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతాకు తెలిసి ఆయన తనపై కోపడ్డారని చెప్పింది. ‘‘అసలు మణిరత్నం సినిమాలు ఎలా ఉంటాయో తెలుసా, ఆయన సినిమాలో నటించడం నీ అదృష్టం. ఈ సినిమా చేయకపోవడం నీ వెర్రితనం’’ అని అన్నారట. అయితే తర్వాత మనసు మార్చుకొని తన తల్లితో కలసి చెన్నై బయలుదేరానని చెప్పుకొచ్చింది మనీషా. అయితే ఆ సినిమా చేయడం వలన తన సినిమా కెరీర్ కు అది చాలా ఉపయోగపడిందని, ఆ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.
అయితే దక్షిణాదిలో ఆశించినంత గుర్తింపు రాలేదని చెప్పింది మనీషా. సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘బాబా’ సినిమా తన సౌత్ కెరీర్ కు తెరపడిందని పేర్కొంది మనీషా. ఆ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయిందని, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మిగిల్చిందన చెప్పింది. ఆ సినిమాపై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, కానీ ‘బాబా’ సినిమా తర్వాత తనకు సౌత్ లో అవకాశాలు బాగా తగ్గిపోయాయని చెప్పింది. ఇక మనీషా కొయిరాలా రీసెంట్ గా కార్తిక్ ఆర్యన్ ‘షెహజాదా’ మూవీలో కనిపించింది. ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హీరామండి’ సినిమాలో నటిస్తోంది.
Also Read : ఐపీఎల్ ఓపెనింగ్‌కు గ్లామర్ టచ్ ఇస్తున్న రష్మిక, తమన్నా