HBD Malavika Mohanan: వారియర్ రోల్‌లో అందాల భామ - మాళవిక మోహనన్ ‘తంగలాన్’ పోస్టర్ చూశారా?

‘తంగలాన్’ సినిమా నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ విడుదల అయింది.

Continues below advertisement

Malavika Mohanan: మలయాళ భామ మాళవిక మోహనన్ పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న ‘తంగలాన్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. ఇందులో మాళవిక వారియర్ రోల్‌లో కనిపించనుందని ఈ పోస్టర్ చూసి తెలుసుకోవచ్చు. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Continues below advertisement

2013లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘పట్టం పోలే’ అనే మలయాళ సినిమాతో మాళవిక మోహనన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించిన మాళవిక మోహనన్... 2019లో ‘పేట’ సినిమాతో తమిళనాట కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆ వెంటనే దళపతి విజయ్ సరసన ‘మాస్టర్’, ధనుష్ సరసన ‘మారన్’ సినిమాల్లో నటించారు. మాళవిక నటించిన మలయాళ సినిమా ‘క్రిస్టీ’ ఈ సంవత్సరం విడుదల అయింది. కానీ ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం తమిళంలో ‘తంగలాన్’, హిందీలో ‘యుధ్ర’, తెలుగులో ప్రభాస్, మారుతిల సినిమాల్లో నటిస్తూ మాళవిక బిజీగా ఉన్నారు.

ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేయూ మోహనన్ కూతురే మాళవిక మోహనన్. హిందీలో ‘రయీస్’, ‘అంధాదున్’, ‘డాన్’, తెలుగులో ‘మహర్షి’ లాంటి భారీ సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. ప్రస్తుతం విజయ దేవరకొండ, పరశురామ్‌ల సినిమాకు కూడా ఆయనే సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇక 'తంగలాన్' విషయానికొస్తే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పా.రంజిత్ దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)లోని కార్మికుల జీవితాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో చియాన్ విక్రమ్ సరసన మాళవిక మోహనన్, పార్వతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. చియాన్ విక్రమ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియా తో పాటు విదేశీ భాషల్లో 2డీ, 3డీలో విడుదలకు సిద్ధమవుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. 

Continues below advertisement