Making Video of Salaar CeaseFire: ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌  ప్రధాన పాత్రల్లో ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 22న ఈ చిత్రం తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. మూడు రోజుల్లో రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.


ఆకట్టుకుంటున్న ‘సలార్’ మేకింగ్ వీడియో


S.S. రాజమౌళి ‘బాహుబలి’ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో కలిసి ఈ సినిమా చేశారు. ‘KGF’తో సెన్సేషనల్ హిట్స్ అందుకు ప్రశాంత్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, సంచనల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంపై సహజంగా దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.  అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. మూవీని  చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ అభిమానులకు ‘సలార్‌’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘సలార్‌’ మేకింగ్‌ వీడియో షేర్‌ చేసింది. ‘సలార్‌ సీజ్‌ఫైర్‌’ తెరకెక్కించేందుకు ఎంతలా కష్టపడ్డారో ఇందులో చూపించింది. సినిమాలో హైలైట్‌గా నిలిచిన పలు యాక్షన్ సన్నివేశాలు ఈ వీడియోలో కనిపించాయి.



బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ‘సలార్’


డిసెంబర్ 22న విడుదలైన ‘సలార్’ మూవీ మూడు రోజుల్లో రూ. 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్‌ ను షేక్ చేసింది. 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 140 కోట్ల గ్రాస్ అందుకుంది.  నాలుగో రోజు మాత్రం కాస్తా డీలా పడింది. రూ. 13.64 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే వచ్చాయి. తెలుగులో రూ. 9.068 కోట్లు, మలయాళంలో రూ. 22.85 లక్షల టికెట్స్ అడ్వాన్స్‌డ్‌ గా బుక్ అయినట్లు సమాచారం. అలాగే హిందీ బెల్ట్‌ లో రూ. 3 కోట్లుకుపైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయట. సలార్‌కు విడుదలైన రెండు రోజుల్లో సుమారు రూ. 20 కోట్లకుపైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. కానీ, నాలుగో రోజు మాత్రం 13.64 కోట్లకు తగ్గాయి.  నాలుగో రోజు సోమవారం కావడం, క్రిస్మస్ పండుగ రావడంతో కాస్త ప్రేక్షకాదరణ తగ్గినట్లు తెలుస్తోంది. రూ. 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ‘సలార్‌’కు మరో రూ. 150 కోట్లు సాధిస్తే క్లీన్ హిట్ ను అందుకుంది.  


‘సలార్‘పై పాయల్ ఘోష్ షాకింగ్ కామెంట్స్


ఇక తాజాగా  అందాల తార పాయల్ ఘోష్  ‘సలార్‌’ మూవీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనం కలిగించాయి. ‘సలార్’తో పాటు ‘డుంకీ’ చెత్త సినిమాలని వెల్లడించింది. 2023లో రిలీజైన సినిమాలు లేవీ చూడబుద్ది కావడం లేదని చెప్పింది. అయినప్పటికీ, ‘సలార్’ కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయని, దానికి కారణం ప్రభాస్ అని వెల్లడించింది.  


Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్