Happy Birthday Sandeep Reddy Vanga: ‘యానిమల్’ విడుదల తర్వాత దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు సందీప్ రెడ్డి వంగా. నెగెటివిటీకి ప్రాధాన్యత ఇస్తూ, ఇదే కొత్త ట్రెండ్ అంటూ ముందుకు సాగుతున్నారు సందీప్. తనకు నచ్చినట్లు సినిమా చేయడమే కాదు, ఆ సినిమాకు ప్రేక్షకుల చేత శభాష్ అంటూ చప్పట్లు కొట్టించుకుంటున్నాడు. విమర్శకుల చేత ప్రశంసలు పొందుతున్నారు. సంప్రదాయాలు, విలువలు, కథలు, కాకరకాయలు అవసరం లేదంటూ ఇంటిమేట్ సీన్లు, రక్తపాతాలు ఇదే నయా ట్రెండ్ అంటాడు సందీప్. ఇప్పటి వరకు ఆయన తీసింది మూడు సినిమాలే అయినా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఈ సెన్సేషనల్ డైరెకర్ట్ 41 వసంతాలు పూర్తి చేసుకుని 42వ ఏట అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తొలి మూవీతోనే తన మార్క్ చూపించిన సందీప్
సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు. పోతుంటారు. తొలి సినిమాతోనే తమ మార్క్ ను క్రియేట్ చేసుకోవడం చాలా రేర్. అలాంటి దర్శకులలో సందీప్ రెడ్డివంగా ఒకరు. ఆయన మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’తోనే సంచలన విజయాన్ని అందుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. టాలీవుడ్ లో గతంలో ఎప్పుడూ రానటువంటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించి ఎన్నో సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. చక్కటి ప్రేమ కథను బోల్డ్ గా చూపించి ఆకట్టుకున్నారు. బోల్డ్ కంటెంట్ ను ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చూపించి సక్సెస్ అయ్యారు. అదే కథను మరింత బోల్డ్ గా బాలీవుడ్ ప్రేక్షకులకు చూపించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ‘కబీర్ సింగ్’తో హిందీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ దేవరకొండను, ‘కబీర్ సింగ్’తో షాహిద్ కపూర్ రేంజిని అమాంతం పెంచేశారు.
‘యానిమల్‘తో బాలీవుడ్ షేక్
ఇక తాజాగా ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేశారు సందీప్ రెడ్డి. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ ను బోల్డ్ గా, అత్యంత వయెలెన్స్ తో చూపించారు. సినిమాను ఇలా కూడా తీయ్యెచ్చా? అని మేకర్స్ లోనే ఓ ప్రశ్న తలెత్తేలా చేశారు. వాస్తవానికి రొటిన్ రివేంజ్ డ్రామా. కానీ, సందీప్ కథనాన్ని నడిపించిన తీరు, హీరో క్యారెక్టర్ ను మలిచిన విధానం అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. మొత్తంగా ‘యానిమల్’ మూవీతో తెలుగు దర్శకుడు సత్తా ప్రపంచానికి చాటారు. బాలీవుడ్ బడా హీరోలతో పాటు, బడా నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే, ఆయన మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తన తర్వాతి చిత్రం ప్రభాస్ తో చేయబోతున్నారు. ‘స్పిరిట్’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది.
వరంగల్ లో జన్మించిన సందీప్ రెడ్డి
ఇక సందీప్ రెడ్డి 1988, డిసెంబర్ 25న తెలంగాణలోని వరంగల్లులో జన్మించాడు. ప్రాథమిక విద్య అక్కడే పూర్తి చేసిన ఆయన, ఇంటర్ హైదరాబాద్ లో కంప్లీట్ చేశారు. కర్ణాటక ధార్వాడ్ SDM కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ నుంని బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. ‘మనసు మాట వినదు’ (2005) చిత్రానికి అప్రెంటిస్‌గా పని చేశారు. ‘కేడీ’ (2006) సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’(2015) చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.’ అర్జున్ రెడ్డి’ (2017) సినిమాతో దర్శకుడిగా మారాడు. రూ. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ. 50 కోట్లు వసూళు చేసి సంచలన విజయాన్ని అందుకుంది. ఇదే సినిమాను బాలీవుడ్ లో కియారా అద్వానీ, షాహిద్ కపూర్ హీరో, హీరోయిన్లుగా ‘కబీర్ సింగ్’(2009) పేరుతో తెరకెక్కించారు. అక్కడ కూడా అద్భుత విజయాన్ని అందుకున్నారు. తాజాగా రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా ‘యానిమల్’(2023) సినిమాను తెరకెక్కించారు. అటు ప్రభాస్ తో కలిసి ‘స్పిరిట్’ అనే సినిమా చేయబోతున్నారు. ఇక 2018లో జరిగిన 7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో వంగా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ (తెలుగు) టైటిల్ గెలుచుకున్నారు. అదే సంవత్సరం 49వ సినీగోయర్స్ అవార్డ్స్ లో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా అవార్డును దక్కించుకున్నారు. 2014లో మనీషాను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్