BRS MLC Kavitha Slams Congress: కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీ అయోమయంలో ఉందని, ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే కాంగ్రెస్ హామీలన్నింటినీ మరిచిపోయిందని, కర్ణాటకలో 6 హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు. 'కర్ణాటకలోని (Karnataka) విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు దాని గురించి గందరగోళంతో ఉన్నారు. వారు వాగ్దానం అమలు చేయరు. అది వారి డీఎన్ఏలోనే ఉంది. దేశ ప్రజలు కాంగ్రెస్ తో ఉండాలా.? వద్దా.? అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది' అంటూ విమర్శించారు.


రాహుల్ పైనా విమర్శలు






ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైనా కవిత విమర్శలు గుప్పించారు. ఈ రోజుల్లో కొంత మంది నేతలు తమ 2 నిమిషాల కీర్తి కోసం ప్రజల మతపరమైన మనోభావాలపై దాడిని ఎంచుకుంటున్నారని మండిపడ్డారు. 'సనాతన ధర్మం విషయంలో రాహుల్ గాంధీ ఇంత వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మిస్టర్ ఎలక్షన్ గాంధీని సనాతన ధర్మం విషయంలో తన స్టాండ్ అడగాలనుకుంటున్నా. దీనిపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.' అంటూ కవిత వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడినప్పుడు, హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలంటూ అవహేళన చేసినప్పుడు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ వైఖరిని వెల్లడించాలని, కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అని మండిపడ్డారు. తెలంగాణలో హామీల అమలుకు మరికొంత సమయం ఇస్తామని, తగిన సమయంలోగా హామీలు అమలు చేయకపోతే కచ్చితంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 


'రాహుల్' సమాధానం చెప్పాలి


దేశాన్ని ఐక్యం చేయడానికి భారత్ జోడో యాత్ర చేశానని రాహుల్ గాంధీ చెప్తున్నారని, కానీ అందుకు వ్యతిరేకంగా వారి మిత్రపక్షం చేస్తున్న వ్యాఖ్యలపై మాత్రం పట్టనట్టు ఉంటున్నారని కవిత విమర్శించారు. భారత్ జోడో యాత్ర కేవలం ప్రచారం కోసమే అనేది తేలిపోయిందని అన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే సీరియస్ గా తీసుకొని రాహుల్ స్పందించి ఉంటే పదే పదే ఇలా వ్యాఖ్యలు చేసి ఉండే వారు కాదని అభిప్రాయపడ్డారు. కేవలం ఎన్నికలప్పుడే పని చేసే రాహుల్ గాంధీని అందరూ 'ఎన్నికల గాంధీ' అని పిలుస్తారని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ జవాబుదారీగా ఉండాలని పేర్కొన్నారు. కార్మికుల పట్ల గౌరవం ఉందని, హిందీ మాట్లాడే రాష్ట్రాలను అవమానించరాదని, హిందూ వ్యతిరేకి కాదని రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులంటే ప్రగతిలో భాగస్వాములని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అన్నారని, కార్మికుల పట్ల తమ పార్టీకి అపారమైన గౌరవం ఉందని, కానీ కాంగ్రెస్ పార్టీకి అలాంటి గౌరవ మర్యాదలేవీ లేవని ధ్వజమెత్తారు. 


'హిజాబ్'పై కర్ణాటకలో ఏం జరిగిందంటే.?


అంతకు ముందు బీజేపీ విధించిన హిజాబ్ బ్యాన్ ఆదేశాలను తమ ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య శుక్రవారం ప్రకటించారు. దుస్తులు, ఆహారం, ప్రజల ప్రాధాన్యతలకు సంబంధించి ఎలాంటి రాజకీయాలు చేయకూడదని ఉద్ఘాటించారు. అయితే, శనివారం తన ప్రకటనను పునరుద్ఘాటిస్తూ హిజాబ్ పై ప్రభుత్వ నిర్ణయం పరిశీలనలో ఉందని, దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 


Also Read: Road Accident News: పొగమంచు కారణంగా తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు- వివిధ ప్రమాదాల్లో ఆరుగురు మృతి