సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులకు గుడ్ న్యూస్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ వాళ్ళకు క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చారు. మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై మహేష్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. షూటింగ్ టు రిలీజ్... కీలకమైన విషయాలను ఆయన వెల్లడించారు.


జనవరి 18 నుంచి షూటింగ్
సంక్రాంతి తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. జనవరి 18న షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు నాగవంశీ తెలిపారు. ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత నాన్ స్టాప్ షూటింగ్ చేసేలా ప్లాన్ చేశారు. మధ్యలో చిన్న చిన్న విరామాలు తప్ప... బ్రేకులు ఇవ్వకూడదని షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. 


పంద్రాగస్టుకు ముందు... 
Mahesh Babu Trivikram Movie Release Date : ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చే మరో న్యూస్ ఏంటంటే... ఈ ఏడాదే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీని కూడా నాగవంశీ కన్ఫర్మ్ చేశారు.


ఆగస్టు 11 శుక్రవారం వచ్చింది. వీకెండ్ సూపర్ కలెక్షన్స్ ఉంటాయి. ఆగస్టు 15 మంగళవారం వచ్చింది. ఆ రోజు సెలవు. దానికి ముందు చాలా మంది సెలవు పెడతారు. ఫైవ్ డేస్ లాంగ్ వీకెండ్ టార్గెట్ చేస్తూ మహేష్, త్రివిక్రమ్ సినిమా విడుదల కానుంది. 


శ్రీలీల సెకండ్ లీడ్ కాదు
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మహర్షి' తర్వాత మరోసారి మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో శ్రీలీల కూడా నటిస్తున్నారు. అయితే, ఆమె సెకండ్ లీడ్ అంటూ వస్తున్న వార్తలపై నాగవంశీ స్పందించారు. ''సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు పూజా హెగ్డే, మరొకరు శ్రీలీల. ఒకరు ఫస్ట్, మరొకరు సెకండ్ అంటూ మేం డిసైడ్ చేయలేదు. ఎవరికీ నంబర్లు ఇవ్వలేదు'' అని నాగవంశీ తెలిపారు. 


ఐదు భాషల్లో మహేష్, త్రివిక్రమ్ సినిమా!
'అతడు', 'ఖలేజా' విజయాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రమిది. సుమారు పన్నెండేళ్ళ విరామం తర్వాత ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. మహేష్ ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ ఈ సినిమా అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. 



Also Read : పవన్ కొలతలు కావాలి, బాలకృష్ణ మాట విన్నారా? - 'అన్‌స్టాపబుల్‌ 2' వీడియో గ్లింప్స్ వచ్చేసిందండోయ్ 



మహేష్ బాబు, త్రివిక్రమ్ తాజా సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. దాంతో ఇది పాన్ ఇండియా సినిమా అనే క్లారిటీ వచ్చింది. భారీ రేటుకు నెట్‌ఫ్లిక్స్‌కు రైట్స్ ఇచ్చినట్లు టాక్.


మహేష్, త్రివిక్రమ్ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఒక సమయంలో ఆయన్ను సినిమా నుంచి తప్పించారని వార్తలు వచ్చాయి. కానీ, వాటిలో నిజం లేదని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఆల్రెడీ రెండు మూడు ట్యూన్లు తమన్ ఫైనలైజ్ చేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.


Also Read : వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి - ఒకే కథను అటు ఇటు చేశారా?