సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. హీరోగా మ‌హేష్‌ 28వ చిత్రమిది. అందుకే, SSMB28 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయ్యిందని సమాచారం. ఫిబ్రవరి 3న... అనగా ఈ గురువారం నాడు పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది.  హైద‌రాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఓపెనింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్‌ల‌కు అటెండ్ కారు. ఆయనకు అదొక సెంటిమెంట్. ఇప్పుడీ త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్‌కు కూడా అటెండ్ కావడం లేదని తెలిసింది. అయితే... ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ కానున్నారట.


మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ ఇది. క్లాసిక్ మూవీ 'అతడు', ఆ తర్వాత మ‌హేష్‌కు కొత్త ఇమేజ్ ఇచ్చిన 'ఖలేజా' వచ్చాయి. ఇప్పుడీ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. 'జులాయి' నుంచి 'అల... వైకుంఠపురములో' వరకూ... త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చిత్రాలను ఆయన నిర్మించిన సంగతి తెలిసిందే.


సుమారు పదకొండేళ్ల విరామం తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న చిత్రమిది. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 'అరవింద సమేత వీరరాఘవ', 'అల... వైకుంఠపురములో' సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఆ సినిమాల తర్వాత త్రివిక్ర‌మ్‌తో త‌మ‌న్‌కు ఇది హ్యాట్రిక్. గతంలో మహేష్ బాబు 'దూకుడు', 'బిజినెస్ మేన్', 'ఆగడు' సినిమాలకు కూడా తమన్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.