Mahesh Babu Speaches At Guntur Kaaram Pre Release Event: మహేశ్‌ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గుంటూరులో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొని సందడి చేసింది. భారీగా అభిమానులు తరలి వచ్చారు.


అభిమానులే అమ్మానాన్న- మహేష్ బాబు


ఇక ఈ వేడుకలో పాల్గొన్న మహేష్ బాబు అభిమానులే తనకు అన్నీ అన్నారు. ప్రస్తుతం తనకు తల్లిదండ్రులు లేరని, అమ్మైనా, నాన్నైనా అభిమానులేనని చెప్పారు. “గుంటూరులో వేడుక జరగడం సంతోషంగా ఉంది. ఇక్కడ వేడుక జరపాలనే ఐడియా దర్శకుడు త్రివిక్రమ్ దే. ఆయనకు మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎక్కడ ఫంక్షన్ చేయాలి అనుకుంటే మీ ఊళ్లో చేస్తే బాగుంటుందన్నారు. ఇప్పుడు మన ఊళ్లోనే వేడుక జరుగుతుంది. త్రివిక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. నా ఫ్యామిలీ మెంబర్ లాగా. నేను ఆయన గురించి బయట ఎక్కువగా మాట్లాడను. మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువగా ఏం మాట్లాడుతాం?’’ అని అన్నారు. 


‘‘గత రెండు సంవత్సరాలుగా ఆయన నాకు ఇచ్చిన సపోర్టు అమూల్యమైనది. ఆయన సినిమాల్లో నేను చేసినప్పుడల్లా నా ఫర్ఫార్మెన్స్ లో ఓ మ్యాజిక్ జరుగుతుంది. ఎందుకో నాకూ తెలియదు. ‘అతడు’, ‘ఖలేజా’, తర్వాత ఇప్పుడు ‘గుంటూరు కారం’లోనూ జరిగింది. ఇందులో కూడా కొత్త మహేష్ బాబును చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం. సంక్రాంతి నాకు కలిసి వచ్చిన వచ్చిన పండుగ. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది’’ అని అన్నారు.


‘‘మా ప్రొడ్యూసర్ చిన్నబాబు ఫేవరెట్ హీరో నేను. ఆయన మానిటర్ చూసి ఆనందపడే వారు. ప్రొడ్యూసర్ ముఖంలో ఆనందం చూసినప్పుడు కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. శ్రీలీల, మీనాక్షి చౌదరి కూడా చక్కగా చేశారు. శ్రీలీలతో డ్యాన్స్ వేయడం, వామ్మో! అనిపించింది. వారితో పని చేయడం సంతోషంగా అనిపించింది. ఈ సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ మరో లెవెల్. కుర్చీ మడతపెట్టి సాంగ్ కు థియేటర్లు బద్దలైపోతాయి. పాతికేళ్ల నా సినీ కెరీర్ లో మీరు చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేను. సంక్రాంతి మాకు కలిసి వచ్చిన పండగ. ఈ పండగకు సినిమా విడుదల అయ్యిందంటే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అవుతుంది. మా నాన్న లేరు. అమ్మ లేరు. ఇప్పటి నుంచి మీరే నాకు అమ్మ, నాన్న.. అన్నీ. మీ ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.


మహేష్ బాబు అప్పుడ, ఇప్పుడ ఒకేలా ఉన్నారు - త్రివిక్రమ్


“గుంటూరు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. రమణగాడు మీవాడు. మన అందరి వాడు. అందుకే మీ అందరి మధ్యన ఈ వేడుక చేయాలని ఇక్కడికి వచ్చాం. షూటింగ్ లో చాలా అలసిపోయినా, గుంటూరు ప్రజలను కలవడానికి వచ్చాడు. తెలుగు సినిమా పరిశ్రమలో విడదీయలేని ఒక అంతర్భాగం. గొప్ప నటుడు, మహా మనిషితో నేను నేరుగా పని చేయలేదు. కానీ, కృష్ణగారు చేసిన సినిమాకు నేను పోసాని మురళి గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేశాను. ఆ తర్వాత, ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడాను. ఆయనతో గడిపిన ప్రతి క్షణం నాకు అపూర్వమైనది. అంత గొప్ప మనిషికి పుట్టిన మహేష్ ఇంకా ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంది. వాళ్ల నాన్నగారు చేయలేని వెంచర్.. చేయలేని సినిమాలను ఆయన చేయడానికి రెడీగా ఉంటారు అనిపిస్తుంది. ఒక సినిమాకు 100 శాతం పని చేయాలంటే 200 శాతం పని చేస్తాడు ఆయన. నేను ‘అతడు’, ‘ఖలేజా’  సినిమాలు చేసేటప్పుడు ఎలా ఉన్నారో? ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయన రీసెంట్ గా సినిమాల్లోకి వచ్చినట్లుగానే అనిపిస్తుంది. ఆయనను మీరంతా ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జనవరి 12న థియేటర్లలో కలుద్దాం. సంక్రాంతిని గొప్పగా జరుపుకుందాం” అన్నారు.   



మహేష్ బాబును చూస్తే ఆ సినిమాలు గుర్తొచ్చాయి- దిల్ రాజు


‘గుంటూరు కారం’లో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్‌ ‘పోకిరి’, ‘దూకుడు’ సినిమాలు మాదిరగానే ఉందని నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ఆయన ఈసారి థియేటర్లలో దుమ్మురేపబోతోందన్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించగా, తమన్‌ సంగీతం అందించారు.  


Read Also: రౌడీ బాయ్, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ - ఇదీ అసలు విషయం!