పదేళ్ల క్రితం మహేశ్ బాబు-సమంత నటించిన ‘దూకుడు’బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. 2006లో వచ్చిన 'పోకిరి'  తర్వాత మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్టందే 'దూకుడు' అనే చెప్పాలి. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదన్నట్టు దాదాపు ఐదేళ్ల తర్వాత తమ హీరో మూవీ భారీ హిట్టందుకోవడంతో ఘట్టమనేని అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ‘పోకిరి’ 2006లో   ప్లాటినమ్ జూబ్లీ జరుపుకుంది.  ఆ తర్వాత వచ్చిన “సైనికుడు, అతిథి” ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి.  మళ్ళీ బిగ్ స్క్రీన్ పై కనిపించేందుకు రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. 2010లో వచ్చిన ‘ఖలేజా’ అభిమానులకు నిరాశ కలిగించింది. అంటే ‘పోకిరి’ తరువాత మహేశ్ నటించిన మూడు చిత్రాలూ కాస్త నిరాశపర్చాయనే చెప్పాలి. అలాంటి సమయంలో వచ్చిన 'దూకుడు' బాక్సాఫీస్ వద్ద దూసుకు పోయింది. మహేశ్ బాబు-సమంత కలసి నటించిన తొలి సినిమా ఇది. 






2003లో విడుదలైన జర్మన్ మూవీ ‘గుడ్ బై, లెనిన్’ ఆధారంగా 'దూకుడు' తెరకెక్కింది. అందులో భర్త వెస్ట్ జర్మనీకి వెళ్ళగా, ఈస్ట్ జర్మనీలోనే తన పిల్లలతో ఉంటూ క్రిస్టెనా అనే తల్లి సోషలిస్ట్ యూనిటీ పార్టీ ప్రచారంలో పాలు పంచుకుంటూ ఉంటుంది. ఆమె తనయుడు అలెక్స్ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాడు. అతణ్ణి అరెస్ట్ చేస్తారు. అరెస్టయిన తనయుణ్ణి చూసి ఆ తల్లి తట్టుకోలేదు. గుండెపోటుకు గురై కోమాలోకి పోతుంది. ఆమె కోమాలో ఉండగా బెర్లిన్ గోడ కూలిపోయి, ఈస్ట్, వెస్ట్ జర్మనీలు కలసి పోతాయి. కొన్నాళ్ళకు కోమానుండి అలెక్స్ తల్లి కోలుకుంటుంది. ఆమెకు షాక్ కలిగించే విషయాలు చెబితే చాలా ప్రమాదం అని చెబుతారు డాక్టర్లు. దాంతో ఆమె సంతోషం కోసం అలెక్స్ ఈస్ట్ జర్మనీ అంతకు ముందుఎలా ఉందో అలా చూపించడానికి పలు పాట్లు పడతాడు. వెస్ట్ కు వెళ్ళి మరో పెళ్లి చేసుకున్న అలెక్స్ తండ్రి కొడుకు కోరిక మేరకు తిరిగొచ్చేలోగా జర్మనీ రాజకీయ పరిణామాలు తెలుసుకున్న క్రిస్టెనా కన్నుమూస్తుంది. ఇది విషాదంతో ముగిస్తే దీనికి మెరుగులు దిద్దిన దర్శకుడు సుఖాంతం చేశాడు. 






ఆద్యంతం నవ్వులు పూయించిన ‘దూకుడు’ యాభైకి పైగా కేంద్రాల్లో శతదినోత్సవాలు జరుపుకుంది.  విదేశాలలోనూ రికార్డు కలెక్షన్లు రాబట్టింది.  అంతకు ముందు ‘మగధీర’, ‘సింహా’ నెలకొల్పిన ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఈ సినిమా అధిగమించింది. ఆ రోజుల్లో 57 కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రంగా ‘దూకుడు’ నిలచింది. బెంగాలీలో ‘ఛాలెంజ్-2’గానూ, కన్నడలో ‘పవర్’గానూ రీమేక్ అయి సక్సెస్ అయింది.  ఆ ఏడాదికి  ఏడు నంది అవార్డులు అందుకోవడం విశేషం.  ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, సోనూ సూద్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, నాజర్, సుమన్, సయాజీ షిండే, ప్రగతి, షఫీ, వెన్నెల కిశోర్, నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటించారు. “పువ్వాయ్ పువ్వాయ్…” పాటలో పార్వతీ మెల్టన్, “నీ దూకుడు…” సాంగ్ లో మీనాక్షి దీక్షిత్ ఐటమ్ గాళ్స్ గా అలరించారు. ఇక  “నీ దూకుడు…”, “ఇటు రాయె… ఇటు రాయె…” సహా పాటలన్నీ అలరించాయి. శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ’14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్’ పతాకంపై నిర్మించారు. వెండితెరపైనే కాదు ఇప్పటికీ బుల్లితెరపై 'దూకుడు' దూసుకుపోతూనే ఉంది.  ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి 9 గంటలకు హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.లో స్పెషల్ షో ప్రదర్శించనున్నారు. ఇక మహేష్ బాబు ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ రూపొందుతోంది. 


Also Read: Horoscope Today:ఈ రాశులవారు అప్రమత్తంగా ఉండాలి, ఈ రోజు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..


Also Read: చిరంజీవి 43 ఏళ్లు సినీ జర్నీపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్


Als Read: మరింత పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్‌లో ఇంకా.. వెండి కూడా అదే దారిలో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి