సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు (Mahesh Babu Nephew)... తెలుగు దేశం పార్టీ నాయకుడు, ప్రస్తుత గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ రెండో సినిమా ఈ రోజు ప్రారంభమైంది. 'హీరో' సినిమాతో అతడు కథానాయకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో సినిమాను స్టార్ట్ చేశారు.
ప్రశాంత్ వర్మ కథతో...
అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో!
అశోక్ గల్లా కథానాయకుడిగా లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై నల్లపనేని యామిని సమర్పణలో ప్రొడక్షన్ నెం 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి బోయపాటి శ్రీను శిష్యుడు, 'గుణ 369' ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకుడు. 'అ!', 'జాంబీ రెడ్డి' చిత్రాల దర్శకుడు, ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా 'హను-మాన్' తెరకెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది.
వెంకటేష్ క్లాప్...
నమ్రత స్విచ్ఛాన్!
అశోక్ గల్లా రెండో సినిమా ముహూర్తపు సన్నివేశానికి మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా... 'విక్టరీ' వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మిర్యాల రవీందర్ రెడ్డి, సాహు గారపాటి, హరీష్ పెద్ది, ప్రశాంత్ వర్మకు స్క్రిప్ట్ అందజేశారు. ఆది శేషగిరిరావు, బివిఎస్ రవి, గల్లా జయదేవ్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రఫ్ లుక్‌లో చూస్తారు! - అశోక్ గల్లా
సినిమా ప్రారంభోత్సవంలో అశోక్ గల్లా మాట్లాడుతూ ''నేను సాఫ్ట్ గా ఉంటానని అందరూ అంటారు. ఈ సినిమాలో నన్ను రఫ్ లుక్‌లో చూస్తారు. ప్రేక్షకులు నన్ను అలా యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రశాంత్ వర్మ మా చిత్రానికి షో రన్నర్ కావడం మాకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సాయి మాధవ్ గారు మాటలు రాయడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు. ఇటీవల మాస్ మహారాజా 'ధమాకా' సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన బి భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు (Ashok Galla Next Movie).
Also Read : ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ 32 - తమిళ దర్శకుడితో కాదు, తెలుగోడితోనే!
కథపై అశోక్ పేరు రాసి ఉంది - ప్రశాంత్ వర్మ
నాలుగైదేళ్లుగా ఈ కథపై వర్క్ చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు. దీనిపై అశోక్ గల్లా పేరు రాసి పెట్టి ఉందని, అందుకే అతని దగ్గరకు వచ్చిందని ఆయన తెలిపారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తామని, ఇందులో కొత్త అశోక్ గల్లాను చూస్తారని ఆయన చెప్పారు. ఇదొక ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అన్నారు. ప్రశాంత్ వర్మ నెక్స్ట్ లెవల్ స్క్రిప్ట్ అందించారని, ఇదొక కొత్త కథ అని దర్శకుడు అర్జున్ జంధ్యాల తెలిపారు. ప్రశాంత్ వర్మ కథకు మాటలు రాయడం సంతోషంగా ఉందని, ఎప్పటి నుంచి ఆయనతో పని చేయాలనుకుంటుంటే ఇప్పటికి కుదిరిందని సాయి మాధవ్ బుర్రా చెప్పారు.
Also Read : పోకిరి', 'బాహుబలి 2' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నే
ఈ చిత్రానికి మాటలు : సాయి మాధవ్ బుర్రా, కూర్పు : తమ్మిరాజు, సంగీతం : భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ళ.