సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తరచూ విదేశాలకు వెళ్తుంటారు. అది ఫ్యామిలీ వెకేషన్ కోసం కావొచ్చు లేదంటే పర్సనల్ పనుల కోసం కూడా కావొచ్చు. ఇప్పుడు మరోసారి ఆయన ఫారెన్ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అతడి తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. దీంతో అతడు నటిస్తోన్న త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో ఆయన తిరిగి సినిమా సెట్స్ పైకి వస్తారని అందరూ అనుకున్నారు. 


కానీ ఇప్పుడు ఆయన విదేశాలకు వెళ్తున్నారట. అది కూడా సింగిల్ గా వెళ్తున్నారట. మెడికల్ కన్సల్టింగ్ కోసం ఆయన ఫారెన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇష్యూ ఏంటి అనేది బయటకు రానప్పటికీ.. మెడికల్ రిలేటెడ్ పనుల కోసం ఆయన వెళ్తున్నట్లు సమాచారం. అది పూర్తి చేసుకొని వచ్చిన తరువాత త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మళ్లీ మొదలవుతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 


ఇందులో మహేష్ బాబు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడట. మహేష్ బాబుకి ఇలాంటి సాఫ్ట్ రోల్స్ బాగా సూట్ అవుతాయి. ఇదివరకు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ గా కనిపించారు. కానీ ఈసారి ఉద్యోగిగా కనిపించనున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ లో పూర్తిగా కుటుంబ నేపథ్యంలో సాగే సన్నివేశాలను తెరకెక్కిస్తారు. ఈ షెడ్యూల్ లో పూజా హెగ్డే జాయిన్ కానుంది.


మహేష్ సినిమాలో ఐటెం సాంగ్:
తొలిసారి మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ ఐటెం సాంగ్ పెట్టబోతున్నారట. ఈ విషయంపై నిర్మాత నాగవంశీ కూడా స్పందించారు. సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని అనుకున్న మాట నిజమేనని.. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్, మాస్ ప్రేక్షకుల కోసం ఐటెం సాంగ్ పెడితే బాగుంటుందని.. త్రివిక్రమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు నాగవంశీ. ఆయన ఇంకా ఈ విషయంపై డెసిషన్ తీసుకోలేదని చెప్పారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' రెండూ థియేటర్లో అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయాయని.. కానీ టీవీలో బిగ్గెస్ట్ వ్యూస్ అందుకున్నాయని చెప్పారు. 
 
ఈసారి ఈ కాంబో మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. వాటిని మించి సినిమా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు నాగవంశీ. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఉండదు కానీ స్పెషల్ పబ్ సాంగ్స్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు కోసం తన పంథా మార్చుకొని ఐటెం సాంగ్ పెడతారో లేదో చూడాలి!


#SSMB28Aarambham:
ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వక ముందు, షూటింగ్ మొదలైన తరువాత.. సినిమాకి టైటిల్ ఇదేనంటూ చాలా రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. షూటింగ్ మొదలుపెట్టిన రోజు #SSMB28Aarambham అంటూ మేకర్స్ ఒక హ్యాష్ ట్యాగ్ వదలడంతో.. ఈ సినిమాకి టైటిల్ హింట్ ఇచ్చేశారని అందరూ భావించారు. 'ఆరంభం'(Aarambham) అనేది  సినిమా టైటిల్ అని.. అందుకే అలా ట్యాగ్ చేశారంటూ ఆ టైటిల్ ను ట్రెండ్ చేశారు.
 
'అయోధ్యలో అర్జునుడు':
మేకర్స్ మాత్రం ఈ టైటిల్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మరో టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు త్రివిక్రమ్, ఇటు మహేష్ బాబు ఇద్దరి సెంటిమెంట్ కలగలిసేలా 'అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ పెట్టబోతున్నారని టాక్. ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదివరకు త్రివిక్రమ్ సినిమాల టైటిల్ విషయంలో ఏం జరిగేదో అందరికీ తెలిసిందే. ఒక టైటిల్ ను వారే క్రియేట్ చేసి జనాల్లోకి వదిలేవారు. ఆ టైటిల్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి టైటిల్ మార్చడమా..? ఫైనల్ చేయడమా..? అనే విషయంలో నిర్ణయం తీసుకునేవారు. మరిప్పుడు 'అయోధ్యలో అర్జునుడు' టైటిల్ ను ఫైనల్ చేస్తారో లేదో చూడాలి! 


Read Also: ఈ సిరీస్ చూస్తే గజగజ వణకాల్సిందే! ఎక్కువగా ఉలిక్కిపడే సీన్లతో ‘ది మిడ్ నైట్ క్లబ్’ గిన్నిస్ రికార్డు!