సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna Death) భువిని వదిలి దివికి వెళ్ళారు. ఈ రోజు ఉదయం ఆయన ప్రాణాలు విడిచారు. గతంలో ఆయనకు కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు ఎదురయ్యాయి. సినిమా షూటింగ్స్ అంటే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అందులోనూ నది, సముద్రంలో షూటింగ్ అంటే రిస్క్ ఎక్కువ. తుఫాను వస్తే ముప్పు ఎదురు అయ్యే అవకాశం ఉంటుంది. కృష్ణ, విజయ నిర్మల దంపతులు ఓసారి అలాంటి ప్రాణగండం నుంచి తప్పించుకున్నారు.
విజయ నిర్మలతో పరిచయం... పెళ్లి!
కృష్ణ, విజయ నిర్మలకు ఎదురైన ప్రాణగండం గురించి చెప్పే ముందు వాళ్ళ ఇద్దరి మధ్య పరిచయం ఎక్కడ? ఎప్పుడు? ఎలా? జరిగిందనేది చెప్పాలి. పెళ్లి వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.
బాపు దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా నటించిన తొలి సినిమా 'సాక్షి'. హీరోగా ఆయనకు ఐదో చిత్రమది. అందులో విజయ నిర్మల (Vijaya Nirmala) కథానాయిక. హీరో హీరోయిన్లుగా వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో తొలి సినిమా కూడా అదే. ఆ షూటింగ్ సమయంలో పరిచయం అయ్యింది.
మీసాల కృష్ణుడి 'సాక్షి'గా...
కృష్ణ, విజయ నిర్మల కలయికలో మొత్తం 50 సినిమాలు వచ్చాయి. అలాగే, విజయ నిర్మల దర్శకత్వం వహించిన 30 సినిమాల్లో కృష్ణ నటించారు. ఆమె కంటే ఒక్క సినిమా ఎక్కువ... కె.యస్.ఆర్. దాసు దర్శకతంలో 31 సినిమాలు చేశారు. కృష్ణ, విజయ నిర్మల కలయికలో ఎన్ని సినిమాలు వచ్చినా... తొలి సినిమా 'సాక్షి' చాలా అంటే చాలా ప్రత్యేకం. ఆ సినిమా చిత్రీకరణ రాజమండ్రి దగ్గరలోని పులిదిండిలో జరిగింది. ఆ ఊరిలో 'మీసాల కృష్ణుడు' దేవాలయం ఉంది. అందులో 'సాక్షి' కోసం ఆరుద్ర రాసిన 'అమ్మ కడుపు చల్లగా... అత్త కడుపు చల్లగా... బతకరా బతకరా పచ్చగా' పాట చిత్రీకరించారు. ముఖ్యంగా ఆ పాటలో వివాహ కార్యక్రమం మొత్తాన్ని కృష్ణ, విజయ నిర్మలపై శాస్త్రోకంగా పిక్చరైజ్ చేశారు.
Also Read : సూపర్ స్టార్ కృష్ణకు తీరని కోరికలు - ఆ నాలుగూ...
మీసాల కృష్ణుడి గుడిలో షూటింగ్ఆ చేస్తున్నప్పుడు ''ఈ గుడి చాలా మహిమ గల శక్తివంతమైన గుడి. ఇందులో జరిగిన మీ సినిమా పెళ్ళి త్వరలో నిజం పెళ్ళి అవుతుంది' అని రాజబాబు అన్నారు. అప్పుడు అందరూ ఆ మాటలకు సరదాగా నవ్వుకున్నారు. కానీ, ఆ తర్వాత నిజంగా వాళ్ళిద్దరి మధ్య బంధం పెళ్ళికి దారి తీసింది. మార్చి 24, 1969న తిరుపతిలో వివాహం చేసుకున్నారు.
పెళ్ళి తర్వాత పాపికొండల్లో...
వివాహమైన తర్వాత కృష్ణ, విజయ నిర్మల కలిసి నటించిన తొలి సినిమా 'అమ్మ కోసం'. అప్పటికి ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలియడంతో చాలా మంది శుభాకాంక్షలు చెప్పడం మొదలు పెట్టారు. 'అమ్మ కోసం' చిత్రీకరణకు రాజమండ్రి దగ్గరలోని పాపికొండలకు కొత్త దంపతులు వెళ్ళారు. ఆర్టిస్టులకు పాపికొండల బస ఏర్పాటు చేశారు. కొత్త జంటకు మాత్రం హౌస్ బోట్ ఇచ్చారు.
ప్రాణగండం తెచ్చిన తుఫాను!
గోదావరిలో తేలియాడే 'హౌస్ బోట్'లో కృష్ణ, విజయ నిర్మలకు బస. అప్పట్లో బోట్లకు ఇంజిన్లు ఉండేవి కాదు. వాటిని తాళ్లతో నది ఒడ్డున ఉన్న చెట్లకు కట్టి ఉంచేవారు. షూటింగ్ చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. గోదావరి అల్లకల్లోలమై విశ్వరూపం చూపించడం స్టార్ట్ చేసింది. మెల్లగా నీటి మట్టం పెరిగింది. నదిలో నీటి ప్రవాహానికి, ఆటుపోట్లకు బోట్‌కు రంద్రం పడింది. కృష్ణ, విజయ నిర్మలకు ఈత రాదు. దాంతో అందరిలో ఆందోళన మొదలైంది. ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు. ఆ సమయంలో స్టంట్ మాస్టర్ రాజు నాలుగు గుర్రాలకి తాళ్ళు కట్టి వాటిని బోటుకు బిగించి ఒడ్డుకు లాక్కుని వచ్చారు. రాజు మాస్టర్ సమయస్ఫూర్తి వల్ల కొత్త జంట ప్రాణాలతో బయట పడింది. తుఫాను హెచ్చరికల కారణంతో షూటింగ్ మధ్యలో ఆపేసి అక్కడ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు.
Also Read : సూపర్ స్టార్ కృష్ణ రికార్డులు - ఇంకెవరూ బీట్ చేయలేరేమో!?