సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) ది నిండైన జీవితం! - ఈ మాట ఆయన చెప్పే మాటే. కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వచ్చిన ఆయన, ఆ తర్వాత నిర్మాత అయ్యారు. స్టూడియోకి ఓనర్ అయ్యారు. ఆయనలో దర్శకుడు, ఎడిటర్ కూడా ఉన్నారు. మూడు వందల యాభైకు పైగా సినిమాల్లో కృష్ణ నటించారు. అత్యధిక మల్టీస్టారర్ సినిమాలు చేసిన రికార్డు ఆయన పేరిట ఉంది.
వ్యక్తిగత జీవితానికి వస్తే... అబ్బాయి మహేష్ బాబు మంచి స్థానంలో ఉన్నారు. మనవలు కూడా తెరపైకి వచ్చారు. నిండైన జీవితం గడిపిన కృష్ణకు కొన్ని తీరని కోరికలు ఉన్నాయి. అవి ఏమిటో ఒకసారి చూద్దామా?
ఛత్రపతి శివాజీ సినిమా
తెలుగు ప్రేక్షకులకు అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గుర్తుకు వస్తారు. అంత అద్భుతంగా ఆయన నటించారు. సారీ, ఆ పాత్రకు జీవం పోశారు. విప్లవ వీరుడిగా శంఖం పూరించిన ఆయన... ఛత్రపతి శివాజీగానూ కనిపించాలని ఆశ పడ్డారు.
కృష్ణ ఒకసారి శివాజీ పాత్రలో నటించారు. అయితే... అది పూర్తిస్థాయి పాత్ర కాదు. నిడివి తక్కువ ఉన్న పాత్ర. 'చంద్రహాస'లో కాసేపు శివాజీగా అలరించారు. అయితే, ఆయనకు శివాజీ పాత్ర అంటే చాలా ఇష్టం. అందుకని, 'అల్లూరి సీతారామరాజు' తర్వాత మహారథితో శివాజీ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారు. ఆయన కొంత వర్క్ కూడా చేశారు. అయితే.... ఆ సినిమా వలన మత ఘర్షణలు చెలరెేగుతాయేమోననే సందేహంతో సినిమా వర్క్ ఆపేయమని చెప్పి, ఆ సినిమాను మధ్యలో వదిలేశారు. దాంతో తనకు ఇష్టమైన శివాజీ పాత్రలో వెండితెరపై పూర్తిస్థాయిలో కనిపించాలనే కోరిక ఆయనకు తీరని కోరికగా మిగిలింది.
మహేష్‌ను జేమ్స్ బాండ్‌గా...
తెలుగు తెరకు గూఢచారిని పరిచయం చేసింది కృష్ణే. అందుకని, ఆయనను ఆంధ్రా జేమ్స్ బాండ్ అనేవారు. తనయుడు మహేష్ బాబును జేమ్స్ బాండ్‌గా చూడాలని కృష్ణ ఆశ పడ్డారు. తండ్రి చేసిన పాత్రలు చేయడానికి, తండ్రి సినిమాలు రీమేక్ చేయడానికి మహేష్ వ్యతిరేకం. కౌ బాయ్‌గా కనిపించిన 'టక్కరి దొంగ' ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం అందుకు కారణం ఏమో!? అందుకని, జేమ్స్ బాండ్ తరహా పాత్ర ఇప్పటివరకు చేయలేదు.
KBC లాంటి టీవీ షో చేయాలని...
'కౌన్ బనేగా కరోడ్ పతి'కి అమితాబ్ బచ్చన్ యాంకరింగ్ చేశారు. ఆ షో చూసిన కృష్ణ... తనకు కూడా అటువంటి షో చేయాలని ఉందని ఓ సందర్భంలో చెప్పారు. అంటే... 'కౌన్ బనేగా కరోడ్ పతి' అని కాదు, అటువంటి కొత్త కాన్సెప్ట్‌తో ఎవరైనా టీవీ షో ఆఫర్ తన దగ్గరకు తీసుకు వస్తే చేస్తానన్నారు. టీవీ షోలు చేయడానికి తనకు అభ్యంతరం లేదన్నారు.
Also Read : కృష్ణ సంపాదనే కాదు, సంతానమూ సినిమాల్లోనే - మూడో తరం & రాజకీయం, కృష్ణ లైఫ్‌లో కొన్ని
'కౌన్ బనేగా కరోడ్ పతి'ని తెలుగు వీక్షకుల ముందుకు 'మీలో ఎవరు కోటీశ్వరుడు', 'ఎవరు మీలో కోటీశ్వరులు'గా తీసుకు వచ్చారు. ఆ షో స్టార్ట్ అయ్యే సమయానికి కృష్ణ నటనకు దూరంగా ఉన్నారు. బహుశా... ఆయన ఆరోగ్యం దృష్ట్యా ఎవరూ సంప్రదించేలేదు ఏమో!?
మనవడితో నటించాలని...
తనయుడు రమేష్ బాబు, మహేష్ బాబులతో కృష్ణ నటించారు. అబ్బాయిలు ఇద్దరినీ బాల నటులుగా, ఆ తర్వాత కథానాయకులుగా పరిచయం చేశారు. ఇప్పుడు మనవలు కూడా తెరంగేట్రం చేశారు. 'వన్ నేనొక్కడినే'లో మహేష్ కుమారుడు గౌతమ్ కృష్ణ నటించడానికి ముందు... అతడితో నటించాలని ఉందని చెప్పారు. అది కుదరలేదు. మంచి కథ వస్తే మహేష్‌తో కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. అదీ కుదరలేదు. కృష్ణ జీవితంలో తీరని కోరికలు ఇవి.
Also Read : కృష్ణ ఇక లేరు - ఆయన బాల్యం, ఇండస్ట్రీలోకి రాకముందు జీవితం గురించి తెలుసా?