సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోపక్క తనవంతుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇప్పటికే బుర్రిపాలెం, సిద్దాపురం అనే రెండు గ్రామాలను దత్తత తీసుకున్న ఆయన చిన్నారులకు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఆర్థికంగా స్థోమత లేని కుటుంబాలకు తన సొంత డబ్బులతో వైద్య సేవలు అందిస్తుంటారు. ఇప్పటికే వెయ్యికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించిన మహేష్ బాబు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. 


ఇప్పటికే చిన్నారుల హార్ట్ సర్జరీల కోసం రెయిన్‌బో, ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి పని చేస్తున్న మహేష్ బాబు ఫౌండేషన్ తాజాగా.. రెయిన్‌బో హాస్పిటల్స్‌కి చెందిన   ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలసి పనిచేయబోతుంది. దీనికోసం రెయిన్‌బో చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ లో ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ని ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ని మొదలుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు మహేష్ బాబు. 


పిల్లలు తన హృదయానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటారని.. కార్డియాక్ కేర్ అవసరమైన చిన్నారులకు మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా సహాయం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు మహేష్.