Sonarika Badoriya Haldi Event : బుల్లితెర పార్వతి దేవిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సోనారిక తన పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. తాజాగా తన ప్రియుడితో కలిసి హల్దీ వేడుకల్లో పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోల్లో హీరోయిన్ చాలా బ్యూటీఫుల్‌గా కనిపించింది. హల్దీ వేడుకల్లో భాగంగా హీరోయిన్ ఆభరణాలకు బదులుగా పూలను ధరించి గాంధర్వ కన్యలా ముస్తాబైంది.
హల్దీ వేడుకల సందర్భంగా ఈ భామ పసుపు రంగు ఔట్ఫిట్లో.. పార్టనర్‌కి మ్యాచింగ్ ఔట్ఫిట్ ఎంచుకుంది. చెవులకు, చేతులకు గాజుల ప్లేస్‌లో పూలను అలంకరించుకుని బ్యూటీఫుల్‌గా ముస్తాబైంది. ముత్యాలతో కూడిన డిజైనర్ బ్లౌజ్లో ఆమె గాంధర్వ కన్యలాగా కనిపించింది. బంధువులు, మిత్రులు వారిని పూల వర్షంలో ముంచెత్తారు. ఫోటోల్లో వధూవరులు చాలా అందంగా కనిపించారు.
కాబోయే భర్తతో కలిసి ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది సోనారిక. ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది ఈ బ్యూటీ. అభిమానులు వారికి కామెంట్ల రూపంలో బెస్ట్ విషెష్ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోనారికా భాడోరియా పెళ్లి గురించి ఎప్పటినుంచో చర్చ జరుగుతుంది. 2022లో ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్‌ను సోనారిక నిశ్చితార్థం చేసుకుంది. అప్పటి నుంచి వీరి పెళ్లి కబురుపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ఈ జంట. ఎంగేజ్మెంట్ అయిన ఏడాదిన్నర తర్వాత వీరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
బంధుమిత్రుల సమక్షంలోనే వీరి పెళ్లిని గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటుంది ఈ జంట. రాజస్థాన్‌లోని రణతంబోర్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఎంగేజ్మెంట్ ఏడాది క్రితం జరిగినా.. ఎనిమిదేళ్లుగా ఈ భామ అతనితో రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లు ఇద్దరూ ట్రావెల్ చేసి.. వారితో జీవితం బాగుంటుందని నిర్ణయించుకున్నాకే.. ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లడం జరిగిందని తెలిపింది హీరోయిన్. హీరోయిన్లు బిజినెస్ మ్యాన్స్‌ని పెళ్లి చేసుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందని.. సోనారిక భడోరియా కూడా అదే కోవలోకి వెళ్లింది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
బుల్లితెరపై పార్వతి దేవిగా కనిపించిన సోనారికా.. వెండితెరపై కూడా మెరిసింది. మహాదేవ్ సీరియల్లో పార్వతిగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇదే కాకుండా పలు హిందీ సీరియల్స్ నటించి మెప్పించింది. తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగశౌర్యతో కలిసి జాదుగాడు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత సోనారిక బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి స్పీడున్నోడు చేసింది.
తెలుగులో చివరిగా ఈడోరకం.. ఆడోరకం సినిమాలో కనిపించింది. తన అందం, నటనతో ప్రేక్షకుల మెప్పును పొందేందుకు ప్రయత్నించింది కానీ.. సీరియల్లో వచ్చినంత గుర్తింపు సినిమాల్లో రాలేదు. తన కథల ఎంపికలు కూడా పేలవంగా ఉండడంతో ఆమె ఇండస్ట్రీకి దూరమవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆఫర్లు లేక తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది సోనారిక. ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో బ్యూటీ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా? లేదా? అనే విషయంపై హీరోయిన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.