AP DSC 2024 News: ఏపీ డీఎస్సీ (AP DSC) అభ్యర్థులకు తిప్పలు తప్పడం లేదు. ఆన్‌లైన్ దరఖాస్తు (DSC Application) చేసేందుకు అభ్యర్థులు (DSC Aspirants) ముప్పుతిప్పలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి కసరత్తు లేకుండా హడావుడిగా ప్రకటన విడుదల చేసి తమ జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడుతున్నారు. దరఖాస్తు చేసే సమయంలో ఏదైనా సమస్య ఏర్పడితే సంప్రదించాలంటూ ప్రభుత్వం ప్రకటించిన నెంబర్లు సరిగా పని చేయడం లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సహాయ కేంద్రాల ఫోన్లు సక్రమంగా పని చేడం లేదని చెబుతున్నారు.


టెట్‌ 2024 హాల్‌ టికెట్ ఎలా రాయాలి?


డీఎస్సీ దరఖాస్తుల్లో ప్రధానమైన సమస్య టెట్‌ హాల్‌టికెట్‌ నెంబర్లు. 2011 నుంచి టెట్‌ హాల్ టికెట్ల నెంబర్లు రాయమని చెబుతున్నారు. వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన లింక్‌లుకానీ ఇతర ఫెసిలిటీస్‌ కానీ లేవు. 13 ఏళ్లుగా హాల్‌టికెట్ల నెంబర్‌ ఎలా ఉంటాయనేది చాలా మందికి కలుగుతున్న అనుమానం. సరే వీటిని ఏదోలా రాస్తే... అసలు 2024 సంవత్సరం టెట్‌ హాల్ టికెట్‌ ఎలా రాయాలి అనేది ఇంకో పెద్ద అనుమానం. 18 వ తేదీ వరకు టెట్‌ అప్లికేషన్లు స్వీకరించారు. ఇప్పటి వరకు టెట్‌2024 హాల్‌టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభించలేదు. అలాంటిది 22 వ తేదీతో ముగియనున్న డీఎస్సీ అప్లికేషన్‌లో టెట్‌ హాల్‌ టికెట్‌ నెంబర్‌ ఎలా రాయాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. 




పొరపాటు చేస్తే రూ.750 కట్టాల్సిందే
అంతేకాదు తప్పుల కరెక్షన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ డీఎస్సీ అభ్యర్థులు మండిపడుతున్నారు. గతంలో తప్పులు వస్తే సరి చేయడానికి అవకాశం ఉండేదని, ఇప్పుడు మరోసారి రూ.750 ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు సమయంలో తప్పులు సహజమని.. వాటిని సరి చేసుకోవడానికి అదనంగా వసూలు చేయడానికి ఇది ప్రభుత్వమా? ఓ ప్రైవేటు వ్యాపార సంస్థనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి దుస్థితి లేదని, దరఖాస్తు సమయంలో పొరపాటున తప్పుడు సమాచారం నమోదు చేస్తే మరోసారి ఫీజు కట్టాలంటే వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించరా? అంటూ అభ్యర్థులు నిలదీస్తున్నారు. 


పేదవారి పరిస్థితి ఏంటి?
డీఎస్సీకి దరఖాస్తు చేసే వారిలో చాలా మంది పేద, మధ్యతరగతి వారే ఉంటారని.. ఇప్పుడు తప్పుడు సమాచారం కరెక్షన్ పేరుతో రూ.750 వసూలు చేయడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు కోచింగ్‌లకు నెలకు రూ.వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇంటిని, అన్నింటిని వదిలేసి దూరంగా ఉంటూ.. ఉద్యోగం కోసం సన్నద్ధమవుతుంటే దరఖాస్తులకు అదనంగా డబ్బులు చెల్లించాలనడం ఏంటని నిరుద్యోగులు నిలదీస్తున్నారు.


వేధిస్తున్న సాంకేతిక సమస్యలు
దీనికి తోడు దరఖాస్తు సమయంలోను అభ్యర్థులను వెబ్‌సైట్ సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ప్రాధాన్యం ఇస్తారు. దరఖాస్తు చేసే సమయంలో స్థానికేతర ఐచ్చికాన్ని ఎంపిక చేసుకుంటే 13 జిల్లాల పేర్లు చూపించాలి. కానీ, దరఖాస్తులో స్థానికేతర అనే ఐచ్ఛికం ఒక్కటే చూపిస్తుంది. జిల్లాల జాబితా చూపడం లేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంటోంది. 


ఆ అవకాశం లేదు
స్కూల్‌ అసిస్టెంట్‌, ఇతర వాటిల్లో స్థానికేతర కోటాలో దరఖాస్తు చేసుకోవాడానికి ఇతర జిల్లాల జాబితా చూపించాలి. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన దరఖాస్తుల్లో ఈ సదుపాయం లేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులు 2,280 ఉన్నాయి. వీటిలో 1,022 పోస్టులు ఒక్క కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. వేరే జిల్లా అభ్యర్థి ఈ జిల్లాలో మెరిట్‌ కోటా 15 శాతం కింద దరఖాస్తు చేసుకోవాలంటే అవకాశం లేకుండా పోయింది. దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఎవరూ పట్టనట్లు  వ్యవహరిస్తురనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


అలాగే పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ) పోస్టులు జోనల్‌ స్థాయిలో ఉన్నాయి. వాటికి దరఖాస్తు చేసుకునే సమయంలో సమస్యలు ఎదురువుతున్నాయి. సాధారణంగా ఒక జోన్‌లో ఉన్న వారు ఎక్కువ పోస్టులు ఉన్న మరో జోన్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఆ సమయంలో స్థానికేతర కోటా కింద దరఖాస్తు చేస్తే అన్ని జోన్‌లు కనిపించాలి. అప్పుడు అభ్యర్థి ఏదో ఒక జోన్‌ను ఎంచుకుని దరఖాస్తు పూర్తి చేస్తారు. అయితే తాజా డీఎస్సీ దరఖాస్తులో స్థానికేతర ఐచ్చికం వస్తుందే తప్ప జోన్‌ల జాబితా చూపడం లేదు. 


రెఫరెన్స్ ఐడీతోను తిప్పలు
దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులుమొదట దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించిన తరువాత రిఫరెన్స్‌ ఐడీ జనరేట్అవుతుంది. అయితే ఇది కొన్ని సార్లు సక్రమంగా పని చేయడం లేదు. కొంత మందికి 8 అంకెల నంబరు వస్తుంది. మరికొందరికి 9 అంకెల నంబరు వస్తోంది. తొమ్మిది అంకెలను ఐడీ వచ్చిన వారికి సమస్య వస్తోంది. రెఫరెన్స్ ఐడీ నమోదు చేస్తే దరఖాస్తును స్వీకరించడం లేదు. అలాగే దరఖాస్తుకు సమయం సైతం చాలా తక్కువ ఇచ్చారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 10 రోజుల సమయం ఇచ్చారని, సర్వర్‌ మొరాయిస్తుండడంతో వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడం లేదని వాపోతున్నారు. గంటల కొద్ది సమయం అప్లికేషన్ పూర్తి చేయడానికే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.