మధుబాల పేరు చెబితే ఓ తరం ప్రేక్షకులకు 'రోజా' గుర్తుకు వస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన అరవింద్ స్వామి సినిమాలో ఆమె నటన అద్భుతం. యాక్షన్ కింగ్ అర్జున్ 'జెంటిల్‌మేన్', యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 'అల్లరి ప్రియుడు' వంటి హిట్ సినిమాల్లో ఆమె నటించారు. సమంత 'శాకుంతలం'లో మేనక పాత్ర చేశారు. అయితే... మధుబాల సెకండ్ ఇన్నింగ్స్‌కు 'గేమ్ ఆన్' పర్ఫెక్ట్ స్టార్ట్ అని, ఈ సినిమాలో ఆమె పూర్తిస్థాయి పాత్ర చేశారని నిర్మాత రవి కస్తూరి తెలిపారు.
గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన సినిమా 'గేమ్ ఆన్'. కస్తూరి క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ సంస్థలపై రవి కస్తూరి నిర్మించారు. నిర్మాతగా ఆయన తొలి చిత్రమిది. దీనికి దయానంద్ దర్శకత్వం వహించారు. మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి నిర్మాత రవి కస్తూరి చెప్పిన విశేషాలు...
గేమ్ ఆన్... సైకలాజికల్ థ్రిల్లర్!
"నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉంది. గీతానంద్ హీరోగా నా నిర్మాణంలో సినిమా చేయాలనుకున్నా. మంచి కథ సెట్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైం కేటాయించాం. ఈ ప్రయాణం నాకు ఎన్నో నేర్పింది. ఎంతో అనుభవం ఇచ్చింది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. కమర్షియల్ అంశాలతో తీశాం. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా ఉన్నాయి. ఇక జీవితాన్ని చాలించాలనుకునే వ్యక్తి దాన్ని ఎలా అధిగమించాడు? అనేది గేమ్ థీమ్'' అని రవి కస్తూరి చెప్పారు.
శుభలేఖ సుధాకర్ వంటి మంచి మనిషిని చూడలేదు!
''గేమ్ ఆన్' ప్రారంభం నుంచి నాలో కాన్ఫిడెన్స్ ఉంది. నిర్మాతగా నేను సహనంతో ఉండాలని నేర్చుకున్నా. హీరో గీతానంద్ నా ఫ్రెండ్. అతడిని ఎప్పటి నుంచో చూస్తున్నా. నటనతో ఆకట్టుకుంటాడు. హీరో, దర్శకుడు దయానంద్ బ్రదర్స్. దాంతో ఫ్రీ హ్యాండ్ ఇచ్చా. 'శుభలేఖ' సుధాకర్ గారి లాంటి మంచి మనిషిని నేను ఇప్పటి వరకు చూడలేదు.చిత్రీకరణ చేసేటప్పుడు ఆయన అందరితో చాలా సరదాగా ఉండేవారు. ఆదిత్య మీనన్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మధుబాల గారికి ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. ఆమె ముఖ్యమైన పాత్రలో నటించారు'' అని రవి కస్తూరి తెలిపారు.
ఆస్ట్రేలియాలో వ్యాపారం... ఇండియాలో సినీ నిర్మాణం!
''ఇటీవల 'గేమ్ ఆన్' ఫస్ట్ కాపీ చూశా. చాలా హ్యాపీగా ఫీలయ్యా. విడుదలైన తర్వాత థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులు కూడా థ్రిల్ అవుతారు. ప్రస్తుతం నేను ఆస్ట్రేలియాలో వ్యాపారాలు చేస్తున్నా. ఒకవైపు ఆ పనులు, మరోవైపు సినిమా చేయడం సవాల్. అయితే.... ఫస్ట్ కాపీ చూశాక ఆ ఒత్తిడి అంతా మర్చిపోయా'' అని రవి కస్తూరి తెలిపారు. అభిషేక్ నేపథ్య సంగీతం, నవాబ్ గ్యాంగ్స్ పాటలు ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటాయని తెలిపారు.
Also Read: 'ఫైటర్' రివ్యూ: హృతిక్ రోషన్ సినిమా హిట్టా, ఫట్టా? 'వార్', 'పఠాన్' రేంజ్‌లో ఉందా?
''నాకు 'గేమ్ ఆన్' సినిమా పది సినిమాలకు సరిపడా అనుభవాన్ని ఇచ్చింది. ఇకపై నిర్మాతగా కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం రెండు కథలు ఫైనలైజ్ చేశా. ఈ సినిమా విడుదల తర్వాత వాటిని అనౌన్స్ చేస్తా'' అని రవి కస్తూరి తెలిపారు.
Also Read: కెప్టెన్ మిల్లర్ రివ్యూ: ధనుష్, సందీప్ కిషన్‌ల వయొలెంట్ సినిమా ఎలా ఉంది?