Chiranjeevi First Reaction on Padma Vibhushan: మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ చిరంజీవికి ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని సైతం పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. ఈ ఏడాది మొత్తం ఐదుగురు ప్రముఖులకు పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించారు. 2006లో చిరంజీవి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు పద్మ విభూషన్ కు ఎంపిక కావడం విశేషం. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డుల్లో చిరంజీవికి కళారంగంలో పద్మవిభూషణ్‌ వరించింది. 


ఇంతటి అరుదైన గౌరవం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి తాజాగా చిరు ధన్యవాదాలు తెలిపారు. తనకు పద్మవిభూషణ్‌ ప్రకటించినట్టుగా వార్త విని సర్‌ప్రైజ్‌ అయ్యాను. మాటలు రావడం లేదు. "అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా మాటలు రాలేదు. ఇప్పటికీ ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. కానీ ఇంతగొప్ప గౌరవం ఇచ్చిన నా అభిమానులకు, కేంద్ఉర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. ఇదంతా కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండ దండలు.. ఎప్పుడూ నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆశీస్సుల వల్లే ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాను. నాకు దక్కిన ఈ గౌరవానికి హృదయపూర్వక కృతజ్ఞుడిని. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి" అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.


Also Read: మెగాస్టార్.. ఇకపై పద్మవిభూషణ్‌ చిరంజీవి - చిరుకు ప్రతిష్టాత్మక అవార్డు..


అనంతరం ఆయన మాట్లాడుతూ.. "ఈ నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వైవిధ్యమైన పాత్రల ద్వారా తెరపై మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు నా శక్తి మేర ప్రయత్నిస్తున్నాను. అలాగే తెరవెనక జీవితంలోనూ సమాజంలో అవసరమైనప్పుడు నాకు తోచిన సాయం చేస్తున్నాను. కానీ నాపై మీరు చూపిస్తున్న కొండంత అభిమానానికి.. నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే.. ఈ నిజం నాకు ప్రతిక్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది.. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చాడు.