Hrithik Roshan, Deepika Padukone's Fighter movie review: హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన సినిమా 'ఫైటర్'. 'వార్', 'పఠాన్' విజయాల తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రమిది. ఇండో పాక్ మధ్య యుద్ధం, తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. 


కథ: ప్యాటీ అలియాస్ షంషేర్ పఠానియా (హృతిక్ రోషన్) ఎయిర్ ఫోర్స్ పైలట్. తనను తాను పైలట్ అని కాకుండా ఫైటర్ అని భావిస్తాడు. అతనితో పాటు మిన్ని అలియాస్ మినల్ రాథోర్ (దీపికా పదుకోన్), సర్తాజ్ గిల్ (కరణ్ సింగ్ గ్రోవర్), బషీర్ ఖాన్ (అక్షయ్ ఒబెరాయ్)... ఇలా బెస్ట్ పైలట్స్ అందరిని ఒక టీంగా ఏర్పాటు చేస్తారు. వాళ్ల కమాండ్ ఆఫీసర్ రాకీ అలియాస్ రాకేష్ జై సింగ్ (అనిల్ కపూర్).


పుల్వామాలో తీవ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌లోని టెర్రరిస్ట్ క్యాంపుపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. సర్తాజ్ గిల్, బషీర్ ఖాన్ పాక్ ఆర్మీ చేతికి చిక్కుతారు. వాళ్లను ప్రాణాలతో వెనక్కి తీసుకు రావడం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది? మధ్యలో ప్యాటీని హైదరాబాద్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి ఎందుకు షిఫ్ట్ చేశారు? ప్యాటీ, రాకీ మధ్య మనస్పర్థలు ఎందుకు వచ్చాయి? ప్యాటీ, మిన్ని మధ్య ఏం జరిగింది? అజర్ అక్తర్ (రిషబ్ సాహ్నీ) ఎవరు? చివరకు సర్తాజ్, బషీర్ ప్రాణాలతో ఇండియా వచ్చారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ: 'ఫైటర్' కంటే ముందు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తీసిన 'వార్', 'పఠాన్' సినిమాలు ఇండో - పాక్ & టెర్రరిస్ట్ నేపథ్యంలో తీసిన సినిమాలే. ఆ రెండిటిలో యాక్షన్ హైలైట్ అయ్యింది. ఈసారీ సేమ్ బ్యాక్‌డ్రాప్ తీసుకున్నారు. కానీ, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మార్పు కనిపించింది. కథ, కథనంలో హ్యూమన్ ఎమోషన్స్ టచ్ చేశారు. యాక్షన్ కంటే ఎక్కువ డ్రామా మీద ఫోకస్ చేశారు.


'ఫైటర్' యుద్ధం తీవ్రవాదం మీద మాత్రమే కాదు... దేశంలో బెస్ట్ పైలట్ తనతో తాను చేసిన యుద్ధం! దేశంలో ఇద్దరు బెస్ట్ పైలట్స్ తమ మధ్య మనస్పర్థలకు చోటు లేకుండా చేసిన యుద్ధం! సైనికుడికి దేశం కంటే ఎక్కువ కాదని చెప్పడానికి చేసిన యుద్ధం కూడా! 


ఇండియాలో బాంబు పేలుళ్లకు కారణమైన తీవ్రవాదుల మీద మన ఎయిర్ ఫోర్స్ చేసిన యుద్ధం నేపథ్యంలో 'ఫైటర్' తీశారని ప్రచార చిత్రాలు చూసిన ప్రేక్షకులకు ఒక అంచనా వస్తుంది. అయితే... దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. టెర్రరిజం కంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్, వాళ్ల క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు. 'వార్', 'పఠాన్' సినిమాల తరహాలో 'ఫైటర్'లో భారీ యాక్షన్ థ్రిల్స్ లేవు. యాక్షన్ తక్కువ, డ్రామా & ఎమోషన్ ఎక్కువ. మధ్యలో కాస్త సాగదీసినట్టు ఉంటుంది. క్లైమాక్స్‌లో చాలా లిబర్టీ తీసుకున్నారు.


'ఫైటర్'లో ఏరియల్ కంబాట్ సీన్స్ బావున్నాయి. బాగా తీశారు కూడా. ప్రేక్షకులకు నచ్చుతాయి. నేపథ్య సంగీతం అంత ఎఫెక్ట్ చూపించలేదు. ఎఫెక్టివ్ రీ రికార్డింగ్ యాడ్ అయితే యాక్షన్ సీక్వెన్సుల్లో గూస్ బంప్స్ మూమెంట్స్ మరింత ఎక్కువ అయ్యేవి. సాంగ్స్ జస్ట్ ఓకే. కెమెరా వర్క్ బావుంది.


సిద్ధార్థ్ ఆనంద్ ఎంపిక చేసుకున్న కథలో గానీ, కథనంలో గానీ, సన్నివేశాల్లో గానీ కాస్త కూడా కొత్తదనం లేదు. ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన దేశభక్తి సినిమాల్లో చూసినవి. అయితే... ఎయిర్ ఫోర్స్ నేపథ్యంతో పాటు నటీనటులు 'ఫైటర్'కు ఫ్రెష్ ఫీలింగ్ తీసుకొచ్చారు.


Also Read: ఇండియన్ పోలీస్ ఫోర్స్ రివ్యూ: సింగమ్ ఫ్రాంఛైజీతో హిట్స్ అందుకున్న రోహిత్ శెట్టి మరీ ఇంత సిల్లీ సిరీస్ తీశాడా?


హృతిక్ రోషన్ స్వాగ్ చాలా సన్నివేశాలను నిలబెట్టింది. పైలట్ పాత్రలో ఆయన పర్ఫెక్ట్ అసలు. 'ప్లీజ్' అని చెప్పేచోట హృతిక్ హ్యాండ్సమ్ లుక్స్, స్మైలీ ఫేస్ గానీ... ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన గానీ... ప్రతి సన్నివేశంలో హృతిక్ రోషన్ ఆకట్టుకుంటారు. మిన్నిగా దీపికా పదుకోన్, రాకీ పాత్రలో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్... ప్రతి ఒక్కరూ పాత్రలకు ప్రాణం పోశారు. టెర్రరిస్ట్ రోల్ చేసిన రిషబ్ సాహ్నీ ఓకే. దీపికాను చూసి తండ్రి సెల్యూట్ చేసే సీన్ కెరీర్ కోసం కుటుంబ సభ్యుల్ని వదులుకున్న అమ్మాయిలకు, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కనే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తివంతంగా ఉంటుంది. 


'ఫైటర్' గురించి క్లుప్తంగా చెప్పాలంటే... కమర్షియల్ ప్యాకేజ్డ్ పేట్రియాటిక్ సినిమా. కథ, కథనం, సన్నివేశాలు కొత్తగా లేవు. కానీ, చూస్తున్నంత సేపూ బోర్ అయితే కొట్టదు. ఏరియల్ కంబాట్ సీన్లను తీసిన విధానం బావుంది. హృతిక్ రోషన్ నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు దేశభక్తి ఉన్న సినిమా. కమర్షియల్ మూవీ లవర్స్‌కు నచ్చుతుంది. 'ఫైటర్' సినిమాలో 'వార్', 'పఠాన్' రేంజ్‌ అయితే కాదు. ఆ రెండు చిత్రాలను దృష్టిలో పెట్టుకుని సిద్ధార్థ్ ఆనంద్ నుంచి యాక్షన్ కోరుకుంటే డిజప్పాయింట్ అవుతారు.


Also Readకాదల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా