అక్టోబర్‌లో రానున్న సినిమాల్లో సూపర్ హైప్ ఉన్నవాటిలో విజయ్, లోకేష్ కనగరాజ్‌ల ‘లియో’ కూడా ఉంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 19వ తేదీన దసరా సందర్భంగా ‘లియో’ విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట గురించి మాట్లాడారు.


‘మీరు (లోకేష్ కనగరాజ్) జోనర్ బేస్డ్ సినిమాలు తీసేటప్పుడు నెమ్మదిగా సెంటిమెంట్ లాంటి వాటిని కట్ చేస్తూ పూర్తిగా యాక్షన్ సినిమాలు చేయాలనే ఉద్దేశంలో తీస్తున్నారు. తమిళ సినిమాకు ఇది కొంచెం కొత్త. ఎందుకంటే 80ల కాలం నుంచి ఉన్న సినిమాల్లో సెంటిమెంట్ లాంటివి ఉంటూనే ఉన్నాయి. కానీ వాటిని మీరు నెమ్మదిగా కట్ చేస్తున్నారు. మరి పాటలు మాత్రం ఎందుకు పూర్తిగా తీసేయలేకపోతున్నారు? కేవలం మార్కెటింగ్ వాల్యూ కోసమేనా?’ అని లోకేష్‌కు ప్రశ్న ఎదురైంది.


దీనిపై స్పందిస్తూ... ‘మార్కెటింగ్ కంటే సినిమాను ప్రమోట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మనం అన్నీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం. దానికి సంబంధించిన రీచ్ కావాలి కదా. తమిళనాడు వరకు ఓకే. కానీ పక్క రాష్ట్రాల్లో తెలియాలంటే మాత్రం పాటలు అవసరమే. ఉదాహరణకు ఆర్ఆర్ఆర్ సినిమాలో సాంగ్ (నాటు నాటు) ఎంత మ్యాజిక్ చేసిందో అందరం చూశాం. ఆ పాట ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లింది. మా ప్రొడ్యూసర్స్ (7 స్క్రీన్ స్టూడియోస్ లలిత్) కూడా అదే కోరుకున్నారు. ఎందుకంటే లియో సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వడానికి ఏమీ లేదు. ఇది పూర్తిగా స్టోరీ బేస్డ్ సినిమా. సోషల్ మీడియాకు, శాటిలైట్ ఛానెల్స్‌కు ఇవ్వడానికి పాటలు తప్ప ఏమీ కనిపించలేదు. పాటలకి బిజినెస్ కూడా జరుగుతుంది. అది కూడా ఒక కారణం. అలాగని ఒక సీన్ దగ్గర నుంచి కట్ చేసి సెట్‌లో సాంగ్ అలా తీయలేను. కథలో నుంచి ఏదైనా తీసుకురావడం కుదురుతుందా? అనే ప్రయత్నమే చేశాం. కానీ మెల్లగా పాటలు లేకుండా సినిమా తీయాలన్నా కూడా భవిష్యత్తులో సాధ్యపడే అవకాశం ఉంది. అంత ఖర్చు పెట్టి సినిమా తీసేటప్పుడు నిర్మాతలు నన్ను అడిగిన ఒకే రిక్వెస్ట్ కేవలం సాంగ్స్ మాత్రమే. ఇది కూడా లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది.’ అన్నారు.


మరో వైపు ‘లియో’... ‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాలలాగా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమేనా, కాదా అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విషయాన్ని నిర్మాత లలిత్‌ను కూడా అడిగారు. ‘ఆ విషయాన్ని బిగ్ స్క్రీన్‌పై చూసే తెలుసుకోవాలి. మేం కావాలనే ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాం.’ అన్నాడు లలిత్. విజయ్ కెరీర్‌లో 67వ చిత్రంగా తెరకెక్కిన ‘లియో’లో చాలాకాలం తర్వాత త్రిషతో జతకట్టాడు. వీరితో పాటు సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, అనురాగ్ కశ్యప్, మిస్కిన్ వంటి నటీనటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ‘లియో’కు హైలెట్‌గా నిలవనుందని నిర్మాత లలిత్ తెలిపారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial