Bollywood Actress Zeenat Aman's Advice For Youth: బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘దమ్ మారో దమ్’ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఎన్నో అద్భుత చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు. కెరీర్ మంచి జోష్ లో ఉండగానే, నటుడు, దర్శకుడు మజర్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంత కాలం పాటు సాఫీగా సాగిన వివాహ జీవితం ఆ తర్వాత ముందుకు కొనసాగలేకపోయింది. మనస్పర్దల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండూ జీనత్, ఎప్పటికప్పుడు యువతకు పలు సూచనలు, సలహాలు ఇస్తుంటారు.
పెళ్లికి ముందు సహజీవనం చేయండి- జీనత్ అమన్
కొద్ది రోజుల క్రితం ప్రేమ, డేటింగ్ గురించి కీలక విషయాలు వెల్డించారు జీనత్ అమన్. యువత తమ ఫీలింగ్స్ ను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మనసుకు నచ్చగానే మంచం ఎక్కేయకూడదన్నారు. ఎదుటి వారి కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకూడదని చెప్పారు. ఇక తాజాగా యువతకు మరో కీలక సలహా ఇచ్చారు జీనత్. తన గత పోస్టుకు రిలేషన్ షిప్ గురించి సలహాలు ఇవ్వమని చాలా మంది కామెంట్స్ పెట్టారని.. వారి కోసం ఓ విషయం చెప్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, ఇంతకు ముందు ఎప్పుడూ, ఎక్కడ చెప్పని ఓ విషయాన్ని చెప్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రేమలో ఉన్న వాళ్ల కోసం ఈ సలహా ఇస్తున్నట్లు చెప్పారు. ప్రేమలో ఉన్న వాళ్లు పెళ్లికి ముందుకు సహజీవనం చేయాలని సలహా ఇచ్చారు. ఇద్దరికి నచ్చితేనే ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిదన్నారు. తన కొడుకులకు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు వివరించారు.
బెడ్ రూమ్, బాత్ రూమ్ మాత్రమే కాదు..
“ప్రేమలో ఉన్న వారికి రోజూ కొన్ని గంటల పాటు సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడం బాగానే ఉంటుంది. కానీ, అదే ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండగలుగుతారేమో ఆలోచించాలి. బాధలో ఉన్నప్పుడు నిజంగానే ఎదుటి వారిని ఓదార్చగలుగుతారా? మీకు నచ్చింది వండేందుకు ఒప్పుకుంటారా? బెడ్ రూమ్, బాత్ రూమ్ మాత్రమే కాదు, అన్నింటినీ అలాగే పంచుకుంటారా? అడ్జెస్ట్ అవుతారా? అనే విషయంలో క్లారిటీ అనేది చాలా ముఖ్యం. సహజీవనం మంచిదే అయినా, సమాజం దాన్నో తప్పుగా భావిస్తోంది. చాలా మంచి విషయాల్లోనూ సొసైటీ తప్పుడు భావనతోనే ఉంటుంది. అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు మంచి చేసే విషయాల్లో ఏమాత్రం వెనక్కి తగ్గకూడదు” అని తన ఇన్ స్టా వేదికగా జీనత్ రాసుకొచ్చారు. ప్రస్తుతం జీనత్ 'బన్ టిక్కి' చిత్రంతో నటిస్తున్నారు. ఇందులో ఆమె అభయ్ డియోల్, షబానా అజ్మీ తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే, జీనత్ కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి సలహాలు మన సాంప్రదాయాలను ప్రమాదంలో పడేస్తాయని అంటున్నారు.
Read Also : అందుకే నా పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా - అసలు విషయం చెప్పిన తాప్సి