పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

 

నిజానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ 'ఆర్ఆర్ఆర్' కోసం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 25 లేదా.. ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పుడు సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్నట్లు టాక్. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. సినిమా నుంచి 'భీమ్ భీమ్ భీమ్ భీమ్లానాయక్' సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. 

 

ఇప్పటికే సినిమాలో పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు 'భీమ్ భీమ్' సాంగ్ కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా కనిపించనుంది. రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనుంది.