యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో సినిమా మొదలుపెడతారనే విషయంలో క్లారిటీ రాలేదు. మొదటినుంచి కొరటాల శివ సినిమా ఉంటుందని అన్నారు. ఆ తరువాత బుచ్చిబాబు పేరు వినిపించింది. మరి ఏ సినిమాను ముందుగా మొదలుపెడతారో తెలియదు కానీ కొరటాల శివ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. 


రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా.. NTR30 సినిమాకి సంబంధించిన చిన్న వీడియోను విడుదల చేశారు. ''అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి.. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా..'' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఈ వీడియోలో వినిపించింది. బ్యాక్ గ్రౌండ్ లో సముద్రం, పడవలు, రక్తంతో నిండిన నీరు.. లాంటి టెరిఫిక్ విజువల్స్ ని చూపించారు. 

 

ఈ వీడియో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పెద్ద ట్రీట్ అనే చెప్పాలి. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సాబు సిరిల్, శ్రీకర్ ప్రసాద్, రత్నవేలు లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. ఈ ఒక్క వీడియో సినిమాపై అంచనాలను పెంచేసిందనే చెప్పాలి. 

ఈ సినిమాను కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. బస్తీలో చదువుకునే ఓ స్టూడెంట్, అదే బస్తీలో పేద విద్యార్థుల హక్కుల కోసం, పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వంతో ఎటువంటి పోరాటం చేశాడు.. ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొన్నాడు..? అనేదే ఈ సినిమా కథ.