దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీలోని ‘‘నాటు నాటు’’ పాట ప్రపంచవేదికపై సత్తా చాటింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలోనే ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త అధ్యాయం తన పేరున లిఖించుకుంది. తెలుగు సినిమాకి ఆస్కార్ రావడంతో రెబల్ స్టార్ కృష్ణంరాజు చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన సతీమణి శ్యామలా దేవి అన్నారు.
“ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' ఆస్కార్ నామినేషన్ అందుకోవడమే కాదు.. సినిమాలోని 'నాటు నాటు' పాట ఆస్కార్ అందుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట అవార్డు గెలుచుకోవడం, ఆస్కార్ వేదికపై కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకోవడం చూస్తుంటే నాకు కృష్ణంరాజు గారు చెప్పిన మాటలే గుర్తు వచ్చాయి. ఆయన ఎప్పుడూ తెలుగు సినిమాకి ఆస్కార్ రావాలని చాలా బలంగా కోరుకుంటూ ఉండేవారు. ‘ఆర్ఆర్ఆర్’ చూసిన తర్వాత ఈ సినిమాకి అనేక అవార్డులు వస్తాయని ఆయన ముందే ఊహించారు. అలాంటి కృష్ణంరాజు గారి బలమైన కోరికను రాజమౌళి అండ్ టీం నెరవేర్చింది. ఈ సినిమా చేసిన రాజమౌళి, నిర్మాత దానయ్యకి శుభాభినందనలు. ఈ ‘‘నాటు నాటు’’ సాంగ్ మ్యూజిక్ అందించిన కీరవాణి, సాహిత్యం అందించిన చంద్రబోస్, పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరికీ కంగ్రాట్స్. ఈ సాంగ్ కి స్టెప్పులు వేసిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వారి చేత స్టెప్పులు వేయించిన ప్రేమ్ రక్షిత్ కు దీవెనలు. ఈ పాట కోసం అందరూ పడిన కష్టమే ఈరోజు ఇలాంటి గొప్ప అవార్డు తెచ్చి పెట్టేలా చేసింది. తెలుగు సినిమా ఇక్కడితో ఆగకుండా మరింత ముందుకు వెళ్లి మరిన్ని ఆస్కార్ అవార్డులు రాబోయే కాలంలో తీసుకురావాలని కోరుకుంటున్నా” అని శ్యామలా దేవి చెప్పుకొచ్చారు.
Also Read: ఉపాసనకి ఆరో నెల - ఆస్కార్ వేడుకల్లో క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
చరిత్రలో గుర్తుండిపోతుంది: ప్రభాస్
"నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమాగా 'ఆర్ఆర్ఆర్' సినీ చరిత్రలో గుర్తుండిపోతుంది. అద్భుతమైన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు అని ప్రభాస్ ట్వీట్ చేశారు.
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అందుకున్న తొలి తెలుగు సినిమా పాట, తెలుగు భారతీయ సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ చరిత్ర సృష్టించింది. అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకలో పాల్గొనడం కోసం చిత్ర బృందం వెళ్లారు. తెలుగు సంప్రదాయం ఉట్టి పడే విధంగా భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా దుస్తులు ధరించి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం అందరి దృష్టిని ఆకర్షించింది. నాటు నాటు పాటకి ఆస్కార్ ని ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ అందుకున్నారు. అంతకముందు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల బైరవ ఆస్కార్ వేదిక మీద ‘‘నాటు నాటు’’ పాట లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. పాట పాడటం పూర్తయిన తర్వాత ఆడిటోరియంలోని ప్రముఖులు అందరూ కరతాళ ధ్వనులతో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
Also Read: ఇదంతా నిజంగా కలలాగే ఉంది - ఆస్కార్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ ఏమన్నారంటే?