మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. కొంతకాలంగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు. అమృతంలా ఉండే ఆమె గాత్రానికి లక్షల మంది అభిమానులున్నారు. ఆమెతో పాటలు పాడించుకోవడానికి అగ్ర సంగీత దర్శకులు కూడా ఎదురుచూసిన రోజులు ఉన్నాయి. 36 భాషల్లో ముప్పై వేలకు పైగా పాటలు పాడారామె. అయితే తెలుగులో ఆమె పాడిన పాటలు మాత్రం కేవలం మూడే. 


తెలుగులో ఆమె ఎక్కువగా పాటలు పాడకపోవడానికి కారణాలు ఏంటో తెలియదు కానీ.. ఆమె పాడిన మూడు పాటలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచారు. 1955లో వచ్చిన 'సంతానం' సినిమాలోని 'నిదురపోరా తమ్ముడా' పాటను ఆలపించారు లతా. ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది. అలానే 'దొరికితే దొంగలు' సినిమాలో 'శ్రీ వెంకటేశా' అనే పాట పాడారు. 1988లో వచ్చిన 'ఆఖరి పోరాటం' సినిమాలోని 'తెల్లచీరకు' అనే పాటను ఆలపించారు. ఇవన్నీ స్ట్రెయిట్ తెలుగు సినిమా పాటలు. 


వీటితో పాటు 'శ్రీదేవి' అనే సినిమాలో పాటలు పాడారు. యష్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించగా.. రిషి కపూర్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగులో డబ్ చేయగా.. అందులో మూడు పాటలను లతా మంగేష్కర్ పాడారు. ఈ పాటలకు కూడా మంచి ఆదరణ దక్కింది. 


ఇదిలా ఉండగా.. 1995లో విడుదలైన 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమాలో ఆమె పాడిన 'తుఝే దేఖాతోయే జానా సనమ్' సాంగ్ ఈ తరం ఆడియన్స్ ను లతాకు అభిమానులుగా మార్చేసింది. పాపులర్ సింగర్ కుమార్ సానుతో కలిసి లతా ఈ పాట పాడారు. ఇక 2000లో ఐశ్వర్యరాయ్, షారుఖ్ ఖాన్ నటించిన 'మొహబ్బతే' సినిమాలో 'హమ్‌కో హమీసే చురాలో..' అనే పాట కూడా బాగా పాపులర్ అయింది. ఇలా చెప్పుకుంటూపోతే ఆమె పాడిన ప్రతీ పాట ఆణిముత్యమే.