అల్లు శిరీష్(Allu Sirish) హీరోగా నటించిన 'ఎబిసిడి' సినిమా మే, 2019లో విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లలోకి మరో సినిమాతో రాలేదు. కరోనా కారణంగా ప్రతి సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలా శిరీష్ జర్నీకి కొవిడ్ బ్రేకులు వేసింది. 'ఎబిసిడి' సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, అల్లు శిరీష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా విడుదలైన మూడేళ్లకు మరో సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. 


అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఒక సినిమాను రూపొందించింది. ఆ మధ్య ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. 'ప్రేమ కాదంట' (Prema Kadanta Movie) టైటిల్‌తో వచ్చిన ఆ సినిమాకు రాకేశ్ శశి దర్శకుడు. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మార్చారు. కొత్త టైటిల్ ఏంటంటే.. 'ఊర్వశివో రాక్షసివో'. రీసెంట్ గానే టైటిల్ అనౌన్స్ చేశారు. 


నవంబర్ 4న (Allu Sirish New Movie Release Date) ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారట. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ కాపీ చూసిన అల్లు అరవింద్ కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లుగా రీషూట్ ప్లాన్ చేశారు. క్లైమాక్స్ ఎపిసోడ్ తో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్స్ లో కూడా మార్పులు చేస్తున్నారట. రిలీజ్ కి కొద్దిరోజులే ఉన్నప్పటికీ.. ఈ ఛేంజెస్ చేసే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు. 


ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. కొత్తగా ఆఫీసులో చేరిన శ్రీ(అల్లు సిరీస్)కి సింధు(అను ఇమ్మాన్యుయేల్) పరిచయం అవుతుంది. లిఫ్టులో ముద్దుతో మొదలైన ప్రయాణం... బెడ్ వరకు వస్తుంది. అయితే... సింధుకు శ్రీ ఐ లవ్యూ చెబితే ''అలా చెప్పడం మానేయ్. మనం మంచి స్నేహితులం మాత్రమే అనుకుంటున్నాను'' అని చెబుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది నవంబర్ 4న థియేటర్లలో చూడాలి. మోడ్రన్ రిలేషన్షిప్స్, లవ్ నేపథ్యంలో సినిమా రూపొందింది. అల్లు శిరీష్ కి ఇప్పుడు సక్సెస్ చాలా ముఖ్యం. మరి తను ఆశిస్తున్నట్లుగా ఈ సినిమా హిట్ అవుతుందేమో చూడాలి. 


ఇక శిరీష్ కెరీర్ చూస్తే... 'గౌరవం' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా తమిళంలో కూడా విడుదల అయ్యింది. 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు', 'ఒక్క క్షణం' వంటి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. తన కంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. మలయాళంలో మోహన్ లాల్‌తో '1971 : బియాండ్ బోర్డర్స్' సినిమా చేశారు.


Also read: ఇనయా - సూర్యల మధ్య ఏం జరుగుతోంది? ప్రశ్నించిన నాగార్జున, ఇనయాకు క్లాస్?