ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ గత కొంత కాలంగా ‘RSS’పై సినిమా చేయాలని భావిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వేగంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. తాజాగా దర్శకుడు రాజమౌళి ‘RSS’ సినిమా స్క్రిప్ట్ చదివి కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో లహరి మ్యూజిక్ రికార్డింగ్ కంపెనీ డైరెక్టర్ లహరి వేలు సంచలన ఆరోపణలు చేశారు. దర్శకుడు రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ‘RSS’ సినిమాను హైజాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.


రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ తీరుతో షాకయ్యా- వేలు


“రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్  ‘RSS’ సినిమా గురించి మాట్లాడుతున్నారు తప్ప, ప్రాజెక్ట్ ఎలా మొదలైందనే విషయం గురించి చెప్పడం లేదు. వారి వ్యవహార తీరు నన్ను షాక్‌కు గురి చేసింది. నేను ఈ సినిమా స్క్రిప్ట్‌ ను తయారు చేశాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సినిమా నా మానస పుత్రిక” అని లహరి వేలు వెల్లడించారు.


“2018లో ‘బాహుబలి-‘2 విడుదలైన తర్వాత ‘RSS’పై సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. నేను RSS సభ్యుడిని కూడా. RSSపై వస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం చెప్పే సినిమా తీయాలి అనుకుంటున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తో చెప్పాను. నాలుగేళ్ల క్రితం విజయేంద్ర ప్రసాద్‌కి ఫోన్ చేసి స్క్రిప్ట్ రాయడానికి ఆసక్తి ఉందా? అని అడిగాను. అయితే, తనకు ఆ సంస్థ గురించి తెలియదని, ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి హైదరాబాద్‌లో తనను కలవమని చెప్పారు. ఆయను కలవక ముందే సినిమా టైటిల్‌ని రిజిస్టర్‌ చేశాను. మా ఇంటరాక్షన్ తర్వాత విజయేంద్ర ప్రసాద్ థ్రిల్ అయ్యి రైటర్‌గా ఓకే చెప్పారు” అని వేలు తెలిపారు.


నా పేరు చెప్పకపోవడం బాధ కలిగించింది- వేలు


రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్‌ ‘RSS’ సినిమా గురించి మాట్లాడేటప్పుడు తన పేరు చెప్పకపోవడం బాధ కలిగించిందని వేలు ఆవేదన వ్యక్తం చేశారు. “‘RSS’  సినిమా కోసం నేను హైదరాబాద్‌లో ఒక కార్యాలయాన్ని ప్రారంభించాను.  స్క్రిప్ట్‌ పై పని చేయడానికి 15 మంది రచయితలకు నిధులు సమకూర్చాను. సంగీత స్వరకర్త రికీ కేజ్, అతడి తండ్రికి RSSతో సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి తెలియజేయడానికి విజయేంద్ర ప్రసాద్‌తో పాటు చెన్నైలో  RSS సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తిని కలిశాం. స్క్రిప్టింగ్ శరవేగంగా జరుగుతున్నందున,  ప్రీ-ప్రొడక్షన్ టీమ్ కోసం RSS చీఫ్ మోహన్ భగవత్‌తో సమావేశం అయ్యాం. ఈ సినిమా విషయంలో భగవత్ అనుమతి పొందడం ముఖ్యం అని నేను భావించాను. అందుకే భగవత్‌ను నాగ్‌పూర్‌లో విజయేంద్ర ప్రసాద్‌తో రెండుసార్లు కలిశాను. సినిమా స్క్రిప్ట్ గురించి తెలుసుకుని తను సంతోషించారు“ అని వేలు  అన్నారు.


ప్రశ్నార్థకంగా ‘RSS’ ప్రాజెక్టు


ప్రస్తుతం ‘RSS’ ప్రాజెక్టు సినిమాగా రూపొందేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి రాజమౌళిని ఎంపిక చేసుకున్నా, తను మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌  చేసేందుకు తను అంగీకరించలేదు. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలని ఆసక్తిగా ఉన్నారని, అయితే అతడు హిట్స్ ఇవ్వకపోవడంతో వేలు సందేహిస్తున్నాడని వర్గాలు చెబుతున్నాయి. అయితే, తాజాగా వేలు రాజమౌళిపై, విజయేంద్ర ప్రసాద్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ‘RSS’ సినిమా పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.


Read Alos: హాలీవుడ్ టాప్ హీరోలకే చెమటలు పట్టిస్తున్న చెర్రీ, తారక్ - ఆ అవార్డుల్లో 2 కేటగిరీల్లో నామినేషన్స్