కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వారిని గెలిపిస్తే, తమను గుండెల మీద తన్ని ఆస్తుల సంపాదన కోసం బీఆర్ఎస్‌లో చేరారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేలను దొరగాని దొడ్లో పశువులుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ‘‘కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన డర్టీ డజన్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం దొరగాని దొడ్లో పశువులుగా మారారు’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మోసం చేసిన కోవర్టులకే మంత్రి పదవులా? అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్ర బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగింది. మొగుళ్లపల్లి సభలో మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాంతం ఆడపడుచుల చైతన్యానికి ప్రతీక. అలాంటి ఈ ప్రాంతంలో ఆడ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ వచ్చాక మనవడికి ఉద్యోగం రాలేదు కానీ.. మందు అలవాటైందని ఓ పెద్దవ్వ చెప్పింది. ఎవరిని కదిలించినా ఎక్కడ చూసినా దుఃఖమే కనిపిస్తుంది. పేదల భూములు కబ్జాలు చేసి.. ఈ ఎమ్మెల్యే పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటుండట. అంతేకాకుండా.. అబద్దాల హామీలు ఇచ్చిన కేసీఆర్ పేదలకు చేసిందేం లేదు. వాళ్ల ఆస్తులు పెంచుకున్నారు తప్ప తెలంగాణకు చేసిందేం లేదు. కేసీఆర్ సీఎం కావాలని, కుటుంబ సభ్యులు, బంధువులు మంత్రులు కావాలని ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉంది’’
‘‘రోడ్డుపై చిన్నారి కుక్కలు కరిచి చనిపోతే మంత్రి కేటీఆర్ సారీ చెప్పి చేతులు దులుపుకున్నారు. పేదోడి కడుపుకోత నీకు తెలుసా కేటీఆర్? బీఆర్ఎస్ పాలనలో పేదోడి బిడ్డను కుక్కలు చంపితే సాయం చేసే మానవత్వం లేదా? పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు తగిలి నాశనమై పోతారు. రాజీవ్ విగ్రాహం సాక్షిగా డ్రామారావుకు సవాల్ విసురుతున్నా. నీ ఎమ్మెల్యే ఆక్రమించున్న భూములపై విచారణకు సిద్ధమా? మీ ఎమ్మెల్యే అక్రమ ఆస్తులపై విచారణకు సిద్ధమా? సింగరేణి నిధుల దోపిడీపై విచారణకు సిద్ధమా? ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అవినీతిపై చర్చకు మేం రెడీ. గండ్ర ఆస్తి మొత్తం కాంగ్రెస్‌దే. ఆయనను ఎమ్మెల్యేను, చీఫ్ విప్‌ను చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఈ విషయాలపై మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా విచారణకు సిద్ధమా?’’
‘‘రాష్ట్రంలో ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోవాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేసే బాధ్యత మాది. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ.5 లక్షల వరకు వైద్యం ఖర్చు కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాం. ఇందిరమ్మ రాజ్యంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి.’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
యాత్ర వాయిదా, మళ్లీ 28న..
భూపాలపల్లి నియోజకవర్గంలో 28వ తేదీన రేవంత్‌రెడ్డి మరోసారి పర్యటించనున్నారు. 24 నుంచి 26 వరకు ఛత్తీస్‌గఢ్ రాజధాని నయారాయపూర్‌లో ఏఐసీసీ ప్లీనరీ ఉండటంతో జోడో యాత్రను వాయిదా వేశారు. 27న పరకాల నియోజకవర్గంలో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి, 28న భూపాలపల్లి నియోజకవర్గంలో యాత్ర చేస్తారు. భూపాలపల్లి పట్టణ పరిధి కాశీంపల్లి నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు పాదయాత్ర చేస్తారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల్లో కాంగ్రెస్‌పై పట్టు కోసం ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో అడుగుపెడుతున్నారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు టీపీసీసీ సభ్యుడు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు ఏర్పాట్లు చేస్తున్నారు.