నయనతార (Nayanthara) తలవంచక తప్పలేదు! చివరకు... థియేటర్స్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్స్ మాట నెగ్గింది. వాళ్ళు చెప్పింది చేయడానికి నయనతార & టీమ్ అంగీకరించింది. 'కనెక్ట్' సినిమాకు ఇంటర్వెల్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. అసలు, వివరాల్లోకి వెళితే.... 


నయనతార మాటకు దర్శక నిర్మాతలు ఎదురు చెప్పరనేది చిత్రసీమలో వినిపించే మాట. తాను పెట్టిన కండిషన్లకు ఓకే అంటేనే సినిమా చేస్తారని టాక్. అయితే, ఓ విషయంలో నయనతార & టీమ్ పెట్టిన కండిషన్‌కు థియేటర్ యాజమాన్యాలు ఓకే అనలేదు. 


ఇంటర్వెల్ లేకుండా ఎలా?
నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'కనెక్ట్' (Connect Movie). దీని నిడివి ఎంతో తెలుసా? 99 నిమిషాలు! అంటే... గంటన్నరకు ఓ పది నిమిషాలు ఎక్కువ. ఇంటర్వెల్ లేకుండా సినిమాను ప్రదర్శించాలని టీమ్ భావించింది. 'కనెక్ట్'కు నిర్మాత ఎవరో కాదు... నయనతార భర్త, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్. ఓ ఇంటర్వ్యూలో ''ఇంటర్వెల్ లేకుండా సినిమా చూస్తే బావుంటుంది. అప్పుడు కథ ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది'' అని ఆయన చెప్పారు. ఆ మాట కోపం తెప్పించింది థియేటర్ యజమానులకు. 


ఫుడ్ బిజినెస్‌కు దెబ్బ!  
సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు... అన్నిటికీ ఇంటర్వెల్ చాలా ముఖ్యం. వై? ఎందుకు? అంటే... ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులు పాప్ కార్న్, సమోసా, కూల్ డ్రింక్స్ వగైరా వగైరా కొనుగోలు చేస్తారు. ఆ బిజినెస్ పెద్దది. అందువల్ల, సినిమా మధ్యలో నో బ్రేక్ అంటే థియేటర్లు ఒప్పుకోలేదు. తమిళనాడులో గానీ, ఏపీలో గానీ ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు టికెట్లు అమ్మాలి. తమకు ఎంతో కొంత ఆదాయం స్నాక్స్, కూల్ డ్రింక్స్ ద్వారా అమ్మడం వల్ల వస్తున్నాయని, అది కోల్పోవడానికి తాము సుముఖంగా లేమని చెప్పేశారు. దాంతో ఇంటర్వెల్ ఇస్తున్నారు. 


గంట తర్వాత ఇంటర్వెల్!
'కనెక్ట్' సినిమా లెంగ్త్ తక్కువ అయినా సరే ఇంటర్వెల్ ఇస్తున్నారు. గంట తర్వాత ఇంటర్వెల్ ఇచ్చి... మళ్ళీ పదిహేను నిమిషాల తర్వాత మిగతా 40 నిమిషాలు ప్లే చేయనున్నారు. ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ ఇవ్వాలనేది డిసైడ్ చేశారు. అదీ సంగతి! 


Also Read : నయనతార 'కనెక్ట్' భయపెట్టిందట, 3 ప్లస్ రేటింగులే - ఆడియన్స్ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే?


తెలుగు, తమిళ భాషల్లో గురువారం 'కనెక్ట్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ తమిళనాడులో ప్రీమియర్ షో వేశారు. తెలుగు మీడియా ప్రతినిధులకు ఈ రోజు చూపిస్తున్నారు. 'కనెక్ట్' సినిమా సూపర్ ఉందని చెన్నైలో ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు ట్వీట్లు చేశారు. విజువల్స్, సౌండ్ డిజైన్ ఎక్స్‌లెంట్ అంటున్నారు. అయితే... కథ విషయంలో నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. చిన్న పాయింట్ పట్టుకుని దర్శకుడు అశ్విన్ శరవణన్ సినిమా తీశారని బావుందని చెబుతున్న ప్రేక్షకులు సైతం ట్వీట్లు చేయడం గమనార్హం. థియేటర్లలో సినిమా చూడాలని అందరూ చెబుతున్నారు. 


అనుపమ్ ఖేర్... సత్యరాజ్!
'కనెక్ట్' సినిమాలో సత్యరాజ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఏడాది సంచలన విజయం సాధించిన 'కార్తికేయ 2'లో అనుపమ్ కనిపించారు. తమిళంలో ఆయన ఇంతకు ముందు ఓ సినిమా చేశారు. అయితే, పదిహేనేళ్ల తర్వాత ఆయన నటించిన తమిళ సినిమా 'కనెక్ట్' కావడం విశేషం. 'వాన' హీరో వినయ్ రాయ్, చైల్డ్ యాక్టర్ హనియా నఫీసా కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి పృథ్వీ చంద్రశేఖర్ సంగీతం అందించగా... మణికంఠన్ రామాచారి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వరించారు.


Also Read : మెగా కజిన్స్ సీక్రెట్ శాంటా - క్రిస్మస్ కోసం కలిసి రామ్ చరణ్, అల్లు అర్జున్