కృతి శెట్టి (Krithi Shetty)... తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మాయి వెరీ వెరీ స్పెషల్. 'ఉప్పెన' నుంచి లేటెస్ట్ రిలీజ్ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' వరకూ ప్రతి సినిమాలో ఆమెను, ఆమె చేసిన పాత్రలను ప్రేక్షకులు అభిమానించారు. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన కొత్త కథానాయికలలో కృతి శెట్టి పేరు ముందు వరుసలో ఉంటుంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాకు, అందులో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సందర్భంగా కృతి శెట్టితో ABP Desam ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ...
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రానికి, అందులో మీ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. ముందే ఊహించారా?
లేదు అండీ! ప్రశంసలు వస్తాయని ఊహించాను. ప్రతి క్యారెక్టర్ కోసం హార్డ్ వర్క్ చేస్తాం. అయితే... కొన్ని క్యారెక్టర్లు మనసులో బలమైన ముద్ర వేస్తాయి. ప్రతి క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ అయినప్పటికీ... 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యింది. అందుకని, ఈ క్యారెక్టర్‌కు ప్రశంసలు రావాలని కోరుకున్నాను. మోహనకృష్ణ ఇంద్రగంటి గారు కూడా హ్యాపీగా ఉన్నారు. దర్శకుడు నేను చేసిన సీన్ చూసి సంతోషంగా ఉన్నారంటే... ఆయన కోరుకున్న విధంగా నేను నటించానని అర్థం కదా! షూటింగ్ చేసేటప్పుడు టూ మార్క్ క్వశ్చన్ పేపర్ ఉంటే... వన్ మార్క్ సంపాదించాననే ఫీలింగ్ వచ్చింది. ఇంకో వన్ మార్క్ ప్రేక్షకుల నుంచి వచ్చింది.
'ఉప్పెన' నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూస్తే... రెండేళ్లలో ఆరు సినిమాలు వచ్చాయి. బిజీ షెడ్యూల్‌ను ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?
కరోనా కారణంగా 'ఉప్పెన' విడుదల ఏడాది ఆలస్యం అయ్యింది. అయితే, పాటలు ముందే విడుదల అయ్యాయి. తెలుగు ప్రేక్షకులకు నేను తెలుసు. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా అవకాశం కూడా 'ఉప్పెన' విడుదల కంటే ముందు వచ్చింది. మిగతా సినిమాలు 'ఉప్పెన' తర్వాత అంగీకరించాను. నిదానంగా విడుదల అవుతాయని అనుకున్నాను. రెండేళ్లలో ఐదారు సినిమాలు వచ్చాయి. నాకు సంతోషంగా ఉంది. ప్రతి సినిమాలో నా క్యారెక్టర్లు డిఫరెంట్‌గా ఉన్నాయి కాబట్టి... నా నటనలో ప్రేక్షకులు డిఫరెంట్ షేడ్స్ చూశారు. కెరీర్ స్టార్టింగ్‌లో ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. క్యారెక్టర్లు డిఫరెంట్‌గా ఉంటే... ప్రేక్షకులు అభిమానించడం మొదలు పెడతారు. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం లభించింది.
'ఉప్పెన'లో విజయ్ సేతుపతితో పతాక సన్నివేశాల్లో మీ నటనకు పేరొచ్చింది. ఆ తర్వాత మీపై అంచనాలు పెరిగాయి. మీపై ఆ అంచనాలు ఒత్తిడి పెంచాయా?
కథల ఎంపికలో ఎప్పుడూ ఒత్తిడికి లోను కాలేదు. 'ఉప్పెన' తర్వాత 'ఆల్రెడీ ఈ సినిమా చేశాను కదా! మళ్ళీ ఇటువంటి రోల్ చేయడం ఎందుకు?' అని భావించాను. కొత్త సినిమాలు చేయాలనుకున్నాను. 'ఉప్పెన', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. అమ్మాయి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్న కథలు రావడం అరుదు. ''ఉప్పెన' చేసిన అమ్మాయి ఇటువంటి పాత్రలు ఎందుకు చేస్తుంది?'' అని ప్రేక్షకులు అనుకున్నారు. నేను సినిమాలు చేయడానికి ఇక్కడ ఉన్నాను. ఎంతో నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను నటించిన ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చింది. రిజల్ట్ ఎలా ఉందనేది పక్కన పెడితే... ఆ క్యారెక్టర్లు నాకు ఎన్నో విషయాలు నేర్పించాయి. వాటితో ట్రావెల్ చేశా. అందుకని, ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడింది. నేను చేసిన ప్రతి క్యారెక్టర్ నాకు ఒక బేబీ లాంటిది. ప్రెజర్ విషయానికి వస్తే... సినిమాల విడుదల తర్వాత ఒత్తిడి ఎదుర్కొన్నాను. ఆ క్యారెక్టర్స్ విషయంలో కొంచెం బాధ పడ్డారు. వాళ్ళు సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం. ప్రేక్షకుల కోసమే సినిమాలు చేస్తాం కదా! నా నటనలో డిఫరెంట్ షేడ్స్ చూపించడం కోసం ఆ రోల్స్ చేశాను. చాలా మంది యాక్సెప్ట్ చేశారు. కొంత మంది చేయలేదు. 'ఎందుకు?' అనే ప్రశ్న వచ్చింది. నేను అన్ని తరహా పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. అది అర్థం చేసుకోవాలి.
కమర్షియల్ సినిమాలు చేయడం కూడా హీరోయిన్లకు ముఖ్యమే. స్టార్ హీరోయిన్స్ అందరూ ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు చేశారు. ఆ తర్వాత డిఫరెంట్ సినిమాలు చేశారు. మీకు కెరీర్ స్టార్టింగ్‌లో డిఫరెంట్ రోల్స్ చేసే ఛాన్స్ వచ్చింది!
శ్రీదేవి గారి కెరీర్ చూస్తే... ఆవిడ డిఫరెంట్ క్యారెక్టర్లు చేశారు. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రల్లో ఇరగదీశారు. కమర్షియల్ హీరోయిన్ రోల్స్‌లో కూడా పర్ఫెక్ట్‌గా చేశారు. ఎక్కడా 'తగ్గేదే లే' అన్నట్లు చేశారు. అటువంటి నటి కావాలనేది నా కోరిక. ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాను. 'ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే కృతి శెట్టి చేయగలదు' అనే నమ్మకం అందరిలో ఏర్పడాలని నేను ప్రయత్నిస్తున్నాను.
సినిమా అనేది టీమ్ వర్క్. అయితే... రిజల్ట్ బాలేనప్పుడు హీరోయిన్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది?
నేను చాలా పోస్టులు చూస్తున్నాను. కొంచెం బాధ పెట్టేలా ఉంటాయి. అయితే... వాటి గురించి ఎక్కువ ఆలోచించను. ఎందుకంటే... నా తప్పు ఏమీ లేదని నాకు తెలుసు. సినిమా ఆడకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. 'బంగార్రాజు' విడుదల తర్వాత ''మీరు నటించిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి కదా!'' అని అడిగారు. నా వల్ల ఆ సినిమాలు విజయాలు సాధించాయని నేను చెప్పను, చెప్పలేను. ప్రేక్షకులు ఆ సినిమాలను యాక్సెప్ట్ చేశారు. ఆయా కథలు, వాటిని తీసిన విధానం... సినిమా విజయానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రతి సినిమాకు మేం పడే కష్టం ఒకేలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ హిట్ సినిమా తీయాలని అనుకుంటారు. నిజాయతీగా సినిమాలు తీస్తారు. ఏ సినిమా వర్కవుట్ అవుతుందనేది తెలియదు. ఏ సినిమా వర్కవుట్ అవుతుందనేది తెలిస్తే... ప్రతి ఒక్కరూ హిట్ సినిమాలే తీస్తారు కదా! పరాజయాలకు ఒక్కరిని బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు.
సోషల్ మీడియా ట్రోల్స్ మీ మీద ప్రభావం చూపిస్తున్నాయా? వాటికి అలవాటు పడిపోయారా?
ఎఫెక్ట్ అంటే... నేను నా స్పేస్‌లో హ్యాపీగా ఉంటాను. బేసిగ్గా పాజిటివ్ పర్సన్. ఏది ఉన్నా సరే... అందులో మంచిని తీసుకుంటాను. హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ ఉంటే వదిలేస్తాను. తొంభై శాతం నెగిటివిటీ, పది శాతం పాజిటివిటీ ఉంటే ఆ పది శాతం తీసుకోవడానికి ట్రై చేస్తాను. మనల్ని కిందకు లాగడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. మనం ఎందుకు వాళ్ళను పట్టించుకోవాలి? వాళ్ళ మాటలు వినాలి? మన పని మనం చేసుకోవాలి. అభిమానులు ప్రేమ చూపిస్తున్నారు కదా! కొంత మంది తమ విలువైన సమయాన్ని కేటాయించి ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. వీడియోస్ ఎడిట్ చేస్తున్నారు. డబ్బులు ఖర్చుపెట్టి సినిమాలకు వస్తున్నారు. సో... నా మీద నెగిటివిటీ ఎఫెక్ట్ ఉండకుండా చూసుకుంటాను. అలాగే, నా ఫ్యాన్స్ మీద కూడా!
ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. యాక్టింగ్ అనేది అంత ఈజీ కాదు. అది అర్థం చేసుకోకుండా ట్రోల్ చేస్తారు. నేను చాలాసార్లు చూశాను... ఎటువంటి కారణం లేకుండా మంచివాళ్ళను కూడా ట్రోల్ చేస్తారు. అది అవసరం లేదు. అలా ఎవరినీ ట్రోలింగ్ చేయకూడదు. మొదట్లో కొంచెం ఆలోచించినా... తర్వాత నన్ను నేను ప్రశ్నించుకున్నాను. 'సినిమాల్లో ఉన్నప్పుడు ఇదంతా కామన్!' సో... ఇప్పుడు ట్రోలింగ్ గురించి పట్టించుకోవడం లేదు. దాన్ని వదిలేసి హార్డ్ వర్క్ చేస్తున్నాను.
మీరు ఎంబీబీఎస్ చేయాలనుకున్నారు. ఇప్పుడు సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. సినిమా సెట్స్‌లో ఎవరి సైకాలజీ ఏంటనేది అబ్జర్వ్ చేస్తారా?
చేయను అండీ! అంత అబ్జర్వ్ చేయను కూడా! నేను సైకాలజీ చేసేది... సినిమాలో క్యారెక్టర్‌ను అర్థం చేసుకోవడానికి! ఇంకొకటి... నేను చాలా యంగ్. నాతో పనిచేసే వాళ్లకు ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉంది. సైకాలజీ చాలా విషయాలు నేర్పుతుంది. నాకు వయసు, ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి పుస్తకాలు చదివితే అర్థం అవుతుందని.
మీరు యంగ్ అన్నారు కాబట్టి ఒక్క ప్రశ్న... మీ సినిమాలు, నటనతో పాటు మీ వయసు గురించి కూడా చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. యాక్టింగ్ గురించి వదిలేసి వయసు గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? అని ఎప్పుడైనా అనిపించిందా?
చాలాసార్లు అండీ! నా ఫీలింగ్ ఏంటంటే... మాట్లాడుకోవడానికి ఏదో ఒక టాపిక్ కావాలేమో!? ఒకవేళ నాకు పాతికేళ్ళు అయితే ఇంకో విషయం గురించి డిస్కస్ చేసేవారు ఏమో!?
Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ
వయసు అనేది సినిమాలకు సంబంధం లేదనేది నా ఫీలింగ్!
థాంక్యూ సో మచ్! ఒక సినిమాను చూడటానికి మీరు వెళుతున్నారంటే... ఆ సినిమాలో కృతిని కాకుండా క్యారెక్టర్‌ను చూడాలి. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో నేను ఐ డాక్టర్ రోల్ చేశాను. నా వయసు కంటే కొంచెం డాక్టర్ వయసు ఎక్కువే ఉంటుంది. నిజ జీవితంలో నా వయసు తక్కువ కావచ్చు. కానీ, ఆ పాత్రలో నేను నటించగలిగా. అప్పుడు వయసు ప్రస్తావన ఎందుకు? అదే సమయంలో నా వయసు గురించి మాట్లాడితే అంత ఇబ్బందిగా ఏమీ ఫీల్ కాను. ఇట్స్ ఒకే.
అక్కినేని నాగ చైతన్యతో ఒక సినిమా, సూర్యతో మరో సినిమా చేస్తున్నారు. అందులో మీ క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి? ఏది ముందుగా విడుదల కావచ్చు?
నా క్యారెక్టర్స్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. సూర్య గారితో చేస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేశా. బహుశా... ఆ సినిమా ముందు విడుదల అవుతుందని అనుకుంటున్నాను.