ఏలూరు జిల్లా ముసునురు ఎస్సై రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 10న నూజివీడు పరిధిలోని ముసునూరు స్టేషన్‌లో ఎస్సైగా లక్ష్మీ నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో కొవ్వూరు ఎస్సైగా పని చేసే వారు. అయితే తీవ్ర అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం ఆయనను వీఆర్ లో పెట్టింది. ఇటీవలే లక్ష్మీ నారాయణకు ముసునూరు మండల పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ గా పోలీసు ఉన్నత అధికారులు నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 


సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లేఖ..


అవినీతి ఆరోపణల కేసులో లక్ష్మీ నారాయణనను డీఐజీ ఉత్తర్వుల మేరకు సస్పెండ్ చేశారు. వీఆర్‌లో ఉండి శిక్ష అనుభవించి, మళ్లీ సస్పెండ్ కావడంతో లక్ష్మీ నారాయణ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. అందుకే ఇక పోలీసుగా కొనసాగలేనంటూ.. రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీకి లక్ష్మీ నారాయణ లేఖ రాశారు.


లక్ష్మీ నారాయణ 2009 బ్యాచ్ కు చెందిన అధికారి. 12 ఏళ్లుగా పోలీసు శాఖ విధులు నిర్వర్తిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో సస్పెండ్ కావడంతో మనోవేదన, అసహనంతో లక్ష్మీ నారాయణ రాజీనామా చేయడం ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీ నారాయణ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్సై ఉదంతం ప్రజలకు తెలియడంతో లక్ష్మీ నారాయణపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 





 


లేఖలో ఏముందంటే..?


లక్ష్మీ నారాయణ రాసిన లేఖలో ఏముందంటే.. " 2009 సంవత్సరంలో సబ్ ఇన్ స్పెక్టర్ గా సివిల్ విభాగంలో సెలెక్ట్ అయ్యాను. నా పేరు యు. లక్ష్మీ నారాయణ. SI. NO. 2195. ఈ రోజున అనగా 16.09.2022వ తేదీన C.No. 10/P1/2022, P.O.No. 560/2022 ప్రకారం సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ఆర్డర్ కాపీని అందుకున్నాను. గతంలో కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో G.No. 27/2022 కేసులో నేను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాను. అలానే డిపార్ట్‌మెంట్‌కు వచ్చేముందునే సస్పెన్షన్ ఆర్డర్స్ లాంటివి ఎదుర్కొనే పరిస్థితి నాకు ఎదురైంది. అందుకే డిపార్ట్‌మెంట్ నుంచి తప్పుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ రోజు రానే వచ్చింది. కాబట్టి అటు వంటి అవినీతి ఆరోపణలో భాగంగా నేను సస్పెన్షన్ ఆర్డర్స్ అందుకుని, ఇంకా డిపార్ట్‌మెంట్‌లో కొనసాగడానికి మనసు అంగీకరించటం లేదు. అలాగని ముందుగా నిర్ణయించుకున్న విధంగా నామనస్సాక్షి చంపుకుని ఈ ఉద్యోగంలో విధులు నిర్వర్తించలేను.


ఏది ఏమైనప్పటికీ నేను నైతిక బాధ్యతకు కట్టుబడి, నేను ముందుగా నా మనస్సును చెప్పినట్టు నిర్ణయించుకున్న విషయానికి కట్టుబడి ఉన్నాను. కావున నేను సస్పెండ్ అయిన తర్వాత భవిష్యత్‌లో విధులు నిర్వర్తించలేను. నా మనస్సు కూడా అంగీకరించదు. ఇక ఈ ఉద్యోగంలో కొనసాగటానికి నేను అనర్హుడను. నైతిక బాధ్యత వహిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను." అని ముసునురు ఎస్సై లక్ష్మీ నారాయణ డీజీపీ లేఖ రాసి రాజీనామా చేశారు.