కృష్ణ కోపంగా ఉంటే భలే అందంగా ఉన్నావ్, నవ్వితే ఇంకా అందంగా ఉంటావని మురారీ బిస్కెట్ వేస్తాడు. అత్తయ్యలో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది ఎందుకో అర్థం కావడం లేదు మీరు అత్తయ్య ఏదో దాస్తున్నారు కదా అని అడుగుతుంది. ఏం చెప్పను కృష్ణ మనల్ని కలిపే ప్రయత్నం చేస్తుంది. నేనంటే నీకు ఇష్టమని ఒక్క మాట చెప్తే ఇక మమ్మల్ని కలిపే ప్రయత్నాలు ఏవీ అవసరం లేదని మమ్మీ కి చెప్తానని అనుకుంటాడు. కృష్ణ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ డైరీ ఉండటం చూసి దాన్ని చదవాలని అనుకుంటుంది కానీ గతంలో చదివింది గుర్తు చేసుకుంటుంది. ఈ డైరీనే నా లైఫ్ డిస్ట్రబ్ చేసింది. నాకు డైరీ అమ్మాయి గురించి తెలిసేది కాదు స్ట్రైట్ గా నా ప్రేమ గురించి అడిగేసెదాన్ని అనుకుని మురారీ తన గురించి రాసింది చదవకుండానే మూసేస్తుంది.


Also Read: పంతులు తెలివి అదుర్స్, తెలివి చూపించిన రాజ్- రాహుల్, రుద్రాణి షాక్


ముకుంద మురారీ గురించి ఆలోచిస్తుంది. తన మనసులో నాకు తప్ప వేరే అమ్మాయికి చోటు లేదని మురారీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా? రేవతి అత్తయ్య చెప్పిందని హోమంలో కూర్చుంటే కృష్ణని భార్యగా అంగీకరించినట్టే. అలా చేస్తే నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పినట్టే. మీ అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి అందరికీ చెప్పేస్తే మంచిది. ఏం చేస్తావ్ నీ నిర్ణయమే మన జీవితాలని శాసిస్తుందని అనుకుంటుంది. అలేఖ్య మళ్ళీ కూపీ లాగడానికి చూస్తుంది. రేవతి అత్తయ్య నిన్ను కూడా హోమంలో కూర్చోవడానికి పిలవమని చెప్పిందని చెప్తుంది. కృష్ణ, మురారీ కూడా వచ్చారా అని ముకుంద ఆశ్చర్యంగా అడుగుతుంది. వాళ్ళు రాకుండా ఎలా ఉంటారని అలేఖ్య అంటుంది. మురారీ, ముకుంద మధ్య ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలని అనుకుంటుంది.


రేవతి కృష్ణని రెడీ చేస్తుంది. మా ఇష్టాయిష్టాలు లేకుండా దైవబలంతో జరుగుతుందని కృష్ణ అనుకుంటుంది. ఇద్దరూ మొహాలు మాడ్చుకుని ఉండటంతో హోమంలో కూర్చోవడం ఇష్టం లేకపోయినా కూర్చోవాల్సిందేనని రేవతి తెగేసి చెప్తుంది. హోమానికి అన్నీ సిద్ధం చేస్తారు. కృష్ణ, మురారీ కలిసి వస్తుంటే ముకుంద తనని ఊహించుకుంటుంది. నువ్వు ఎంత అదృష్టవంతురాలివి కృష్ణ ఇష్టపడి మనసు ఇచ్చిన నాకు దక్కని అదృష్టం నీకు దక్కిందని ముకుంద బాధపడుతుంది. ఇద్దరూ హోమం దగ్గరకి వెళ్ళి పీటల మీద కూర్చోవడానికి సంకోచిస్తారు. ఈ హోమం జరగకుండా ఉండటానికి ఏసీపీ సర్ ఎంత ప్రయత్నించినా కుదరలేదు కానీ దైవబలంతో జరుగుతుందని కృష్ణ సంతోషపడుతుంది. ఈ జన్మకి కృష్ణ తన భార్య అయితే బాగుండని మురారీ మనసులో అనుకుంటాడు. మురారీ, మధుకర్ జంటలు పీటల మీద కూర్చుంటారు.


Also Read: ఖుషి బర్త్ డే వేడుకల్లో కల్లోలం సృష్టించబోతున్న అభిమన్యు


పూజ చేస్తుంటే ఎదురుగా ముకుంద ఉండేసరికి మురారీ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఈ హోమంలో ముకుంద లేకుండా ఉంటే బాగుండేది నేను మనస్పూర్తిగా చేయలేకపోతున్నానని అనుకుంటాడు. కృష్ణ మొహంలో ఉన్న సంతోషం వీడి మొహంలో లేదు అగ్రిమెంట్ కూడా వీడే పెట్టి ఉంటాడని రేవతి మనసులో అనుకుంటుంది. పంతులు దండలు మార్చుకోమని అనేసరికి మురారీ వాళ్ళు దండలు వేసుకోవడం చూసి ముకుంద చాలా బాధపడుతుంది. మురారీ జంటతో అగ్ని సాక్షిగా ప్రమాణాలు చేయిస్తారు. కృష్ణ తనకి ఏడు జన్మలకి భార్యగా రావాలని కోరుకుంటున్నానని మురారీ ప్రమాణం చేస్తాడు. ఇది హోమంలాగా లేదు అగ్నిసాక్షిగా కృష్ణ, మురారీకి మళ్ళీ పెళ్లి జరుగుతున్నట్టుగా ఉందని ముకుంద అనుకుంటుంది.