'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' - కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టర్ హల్‌చల్ చేసింది. ఆ తర్వాత కథానాయకుడిగా మారిన రచయిత ఆనంద్ రవి (Anand Ravi) తన కొత్త సినిమా 'కొరమీను' (Korameenu Movie) కోసం వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారని అర్థమైంది. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు. అందులో రాజు గారి మీసాలు ఎందుకు తీసేశారో చెప్పలేదు గానీ ఎక్కడ తీశాసేరో చూపించారు.


టీజర్ విడుదల చేసిన గోపీచంద్ మలినేని
ఆనంద్ రవి కథానాయకుడిగా ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి 'కోరమీను' చిత్రాన్ని నిర్మించారు. ఎ స్టోరి ఆఫ్ ఇగోస్... అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి శ్రీపతి కర్రి దర్శకుడు. ఈ రోజు ట్విట్టర్ ద్వారా ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని 'కొరమీను' టీజర్ (Korameenu Movie Teaser) విడుదల చేశారు. 






జాలరి పేటలో మీసాలకు...
Korameenu Teaser Review : టీజర్ ప్రారంభంలో నటుడు శత్రును చూపించారు. నేపథ్యంలో వినిపించే మాటలు వింటుంటే... ఆయనే మీసాల రాజు అనేది ఈజీగా అర్థమవుతుంది. సముద్ర తీర ప్రాంతానికి ఆయన వెళ్లడం, అక్కడ ఎవరో ఆయనపై వల వేయడం, మీసాలు తీయడం చకచకా చూపించారు. ''ఈ రోజు జాయిన్ అయిన మీసాల రాజు గారికి జాలరి పేటలో నిన్న రాత్రి ఎవరో మీసాలు తీసేశారని సమాచారం'' అని వాయిస్ ఓవర్‌లో కథలో కీలక విషయాన్ని వెల్లడించారు.


జాలరి పేటకు కొత్తగా పోలీస్ రావడం, జాయిన్ అయిన రోజున ఆయన మీసాలను ఎవరో తీసేయడం, ఆ కోపంతో రగిలే ఆయన తన మీసాలు ఎవరు తీశారో తెలుసుకోవడం కోసం ప్రయత్నించడం... కథలో కీలకమైన అంశం అని తెలుస్తోంది. మరి, మీసాల రాజు కథలో ఆనంద్ రవి, హరీష్ ఉత్తమన్, కిషోరి పాత్రలు ఏమిటన్నది ఆసక్తికరం.
  
'డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ... అసలైన పవర్ భయానిదే రా' అని హరీష్ ఉత్తమన్ (Harish Uthaman) నోటి నుంచి వచ్చే మాట... ఆయన పాత్ర ఏమిటన్నది చెప్పకనే చెప్పింది. జాలరి పేటలో మనుషులను తన భయం గుప్పిట పెట్టుకున్న వ్యక్తిగా ఆయన కనిపించే అవకాశం ఉంది. 'ఇది జాలరి పేట... డబ్బున్నోడు, డబ్బు లేనోడు అంతే!' అని హీరోయిన్ కిషోరీ (Kishori Dhatrak) తో ఆనంద్ రవి మాట చెబుతారు. డబ్బున్న వాళ్ళది రాజ్యమనే మీనింగ్ అందులో వినబడుతోంది. ఆయన క్యారెక్టర్ కూల్‌గా కనబడుతోంది. డ్రసింగ్ స్టైల్ కూడా! 


'మీ నాన్న ఎన్ని అబద్దాలు ఆడితే పుట్టావే!'  అని కిషోరీతో హరీష్ ఉత్తమన్ అంటే... 'మీ తాతను అడిగారా! ఎన్ని అబద్దాలు ఆడితే మీ అమ్మ పుట్టిందో' అని కిషోరీ బదులు ఇచ్చే డైలాగ్ కూడా ఉంది. టీజర్ చివరిలో శత్రు, గిరిధర్, 'జబర్దస్త్' ఇమ్మాన్యుయేల్ (Jabardasth Emmanuel) మధ్య సీన్ చూస్తే... సినిమాలో సెటిల్డ్ కామెడీ ఉందని తెలుస్తోంది. 'మీసాల రాజు గారు అడిగితే మాట్లాడవే...' అని గిరిధర్ కోప్పడిన తర్వాత, 'మీసాలు ఎక్కడ?' అన్నట్టు 'జబర్దస్త్' ఇమ్మాన్యుయేల్ ఇచ్చిన లుక్ బావుంది.



జాలరి పేట కాలనీ నేపథ్యంలో కథ ఉంటుందని చిత్ర బృందం తెలియజేసింది. షూటింగ్ కూడా విశాఖలోని జాలరి పేటలో తీశారట. టీజర్‌లో విజువల్స్ బావున్నాయి. 


దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. ''టీజర్ విడుదల చేసిన గోపీచంద్ మలినేని గారికి థాంక్స్. కథ విషయానికి వస్తే... జాలారి పేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో సాగుతుంది. సరదాగా ఉండే ఓ పడవ డ్రైవర్, డబ్బుతో పాటు అహంకారం కల అతని యజమాని, విశాఖలోని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్... మూడు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది'' అని చెప్పారు. 


Also Read : థియేటర్లలో ఎన్నికల నిర్వహణకు 'అల్లరి' నరేష్ రెడీ - నెలాఖరు నుంచి