Kona Venkat Fires on Trolls : కోనా వెంకట్... ప్రొడ్యూసర్ గా, స్క్రిప్ట్ రైటర్‌గా మనందరికీ పరిచయమే. కానీ, ఆయన వెనుక రాజకీయ నేపథ్యంలో కూడా ఆయన కుటుంబం కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. దీంతో ఆయన రాజకీయపరంగా కొన్ని కామెంట్లు చేస్తుంటారు. పోస్ట్ లు పెడుతుంటారు. ట్రోలింగ్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏదైనా పోస్ట్ పెడితే కండువా కప్పేస్తారని, ఎవరు అభివృద్ధి చేసిన పొగుడుతానని అంటున్నారు కోనా వెంకట్. ట్రోలింగ్ వల్ల చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు చెడ్డ పేరు వస్తుందని చెప్పుకొచ్చారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు. మరి ఆయన ఏమన్నారంటే?
జనాల కోసం పనిచేసిన కుటుంబం మాది...
బాపట్లలో జరిగిన అభివృద్ధికి సంబంధించి ఈ మధ్య కోనా వెంకట్ పెట్టిన పోస్ట్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ విషయమై స్పందించారు కోనా వెంకట్. తనకు అనవసరంగా పార్టీ కండువాటు కప్పుతున్నారని అన్నారు. "నా సొంత ఊరు బాపట్ల. నేను అక్కడే పుట్టాను. బాపట్లలో మా కుటుంబం 25 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తుంది. మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లం మేము. మాకు 25 ఏళ్ల నుంచి ప్రజలు నాయకత్వం అప్పగిస్తూ వచ్చారు. మా తాతగారికి 15 ఏళ్లు, మా బాబాయికి 10 ఏళ్లు. మా బాబాయ్ గారు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా జనాలు పట్టం కడతారు. మా సామాజిక వర్గానికి కేవలం 4 వేలు మాత్రమే ఉన్నాయి కానీ, మిగతా 2లక్షల మంది ఓటర్లు మాకు పట్టం కట్టారు అంటే.. మాపై నమ్మకం. మేం అభివృద్ధి చేస్తాం, మంచి చేస్తాం అని నమ్మకం. మా తాతగారి వల్ల బాపట్ల విద్యా కేంద్రంగా మారింది. మా బాబాయ్ వల్ల జిల్లా అయ్యింది. కేబినెట్ కావాలా? జిల్లా కావాలా? అంటే జిల్లా కావాలి అన్నాడు మా బాబాయ్. జిల్లాకి కేంద్రంగా బాపట్లను పెట్టాడు. మా బాపట్ల మెయిన్ రోడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాగా ఉంటుంది. ఆయన చేస్తున్న సర్వీస్ అందుకే, ఆదరిస్తున్నారు. మాపై నమ్మకం ఉంది కాబట్టే.. ఇండిపెండెంట్ గా నిలబడి రెండో స్థానంలో ఉన్నాం. అలా జనాల కోసం పనిచేసిన కుటుంబం మాది".
ఎవరు అభివృద్ధి చేసినా ఆనందమే..
"నేను ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి గారిని చూడలేదు, కలవలేదు. ఆయన చేసిన మంచి చూసి, స్కూల్ గురించి మాట్లాడితే ఆ పార్టీ కండువా వేసేశారు. ఆయన నా చీఫ్ మినిస్టర్. సీఎం వైసీపీకి చెందిన వాడు. అదే స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నా అలానే మాట్లాడేవాడిని, అంతే ఎమోషనల్ గా ఫీల్ అయ్యేవాడిని. మీడియా వాళ్లందరూ వస్తే తీసుకెళ్తాను. మా నియోజకవర్గంలో హాస్పిటల్స్, స్కూల్స్, ప్రతి పంచాయతీలో ఒక సెక్రటేరియట్. అన్నీ సర్వీసులు అక్కడే దొరుకుతున్నాయి. ఒకప్పుడు పని ఉంటే హైదరాబాద్ వచ్చేవాళ్లు. కానీ, ఇప్పుడు అన్నీ పనులు అక్కడ జరుగుతున్నాయి. ఇది చేసింది టీడీపీ అయి ఉంటే జై టీడీపీ అనేవాడిని. చేసింది వైసీపీలో ఉన్న నా ముఖ్యమంత్రి. నేను అక్కడ ఓటర్ ని. నేను హైదరాబాద్ లో ఉండి కబుర్లు చెప్పడం లేదు. నా ఓటు అక్కడే ఉంది. నా సీఎం ఏ పార్టీ అయినా గౌరవిస్తాను. ఆయన నా ఊరికి మంచి చేశారు. పేదవాళ్లకు మంచి చేస్తున్నారు చాలా హ్యాపీ. రేపు టీడీపీ చేసినా నా రియాక్షన్ ఇలానే ఉంటుంది. నాకు ఎందుకు కండువా వేస్తున్నారు?".
ట్రోలింగ్ దారుణం..
ఈ సందర్భంగా ట్రోలింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నగీతాంజలి అనే మహిళ గురించి మాట్లాడారు కోనా వెంకట్. గీతాంజలి అనే అమ్మాయి చనిపోయింది. "నేను ఇంటికి వెళ్లాను. ఆర్థిక సాయం చేశాను. నేను ఆ పిల్లలతో ఫోన్ లో మాట్లాడతాను. వాళ్ల అమ్మ గీతాంజలి చాలా యాక్టివ్. వాళ్లు నాకు వీడియోలు చూపించారు. అలాంటి తల్లిని దూరం చేశారు. మా సీఎం, మా జగన్ మేలు చేశాడు అన్నందుకు అలా చేశారు. సీఎం హోదాలో జగన్ చేశాడు. దాన్ని చెప్పుకుంది. దానికి ఆ పోస్ట్ కింద రాసిన కామెంట్లు, బూతులు చూసి తట్టుకోలేక ట్రైన్ కిందపడిపోయింది. ఆ పిల్లలు పాపం ఏం తెలియదు. నవ్వుతూ మాట్లాడుతుంటారు. వాళ్లతో రెండు మూడు రోజులకు ఒకసారి ఫోన్ లో మాట్లాడతాను. వాళ్లతో పాటలు పాడించుకుంటాను. ‘గీతాంజలి’ సినిమాలో నాన్న పాట హిట్ అయ్యింది. నాన్న ప్లేస్ లో అమ్మ పెట్టి పాడించాను. చాలా బాగా పాడారు. వెళ్లామా? మీడియా కోసం మాట్లాడామా? అనేది కాదు. న్యాయం చేయాలి, తోడుగా ఉండాలి. వాళ్లకు పొద్దున్న లేస్తే ప్రపంచం అమ్మ. ఆ పిల్లల ప్రపంచాన్ని దూరం చేశారు. సోషల్ మీడియా టెర్రరిజం. ట్రోలింగ్.. భయంకరం. నేను ఏదైనా వీడియో పెడితే.. పేటీఎం కుక్క అంటారు. కండువా వేసేస్తారు. టీడీపీ వాళ్లకు తెలిసి, పవన్ కల్యాణ్ కి తెలిసి చేస్తారో తెలీదు. కానీ, వాళ్లకే చెడ్డ పేరు వస్తుంది" అని ట్రోలింగ్ పై స్పందించారు కోనా వెంకట్.
Also Read: సల్మాన్ ఇంటి ముందు కాల్పులు - ఆ దుండగులు వారే అంటున్న పోలీసులు