చిత్ర పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న నిన్న(శనివారం) సాయంత్రం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే మరో ప్రముఖ నటుడు కన్నుమూశారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు మైల్‌స్వామి(57) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఈ తెల్లవారు జామున ఒంట్లో కాస్త నీరసంగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పారు. వెంటనే ఆయనను పోరూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆయన్ని పరీక్షించి అప్పటికే ఆయన చనిపోయినట్లు తెలిపారు. మైల్‌స్వామి మరణ వార్తతో కోలీవుడ్ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
1984లో నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన మైల్‌స్వామి
మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన మైల్ స్వామి 1984లో నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. మొదట్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. నెమ్మదిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. 2000 నుంచి కమెడియన్‌గా మంచి గుర్తింపు సంపాదించారు. పలు సినిమాల్లో తనదైన నటనతో, కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. ఆయన తమిళంతో పాటు పలు తెలుగు సినిమాల్లోనూ నటించాడు. టాలీవుడ్ లో కమెడియన్ గా, విలన్ గా పలు పాత్రలు పోషించారు.
మైల్‌స్వామి మృతి పట్ల పలువురు ప్రముఖుల సంతాపం
మైల్‌స్వామి మృతి పట్ల తమిళ, సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల తమిళ సినీ నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సతైం మలై స్వామి మరణంపై ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసారు. హాస్యనటుడు మయిల్ సామి అనారోగ్య కారణాలతో మరణించారనే వార్త విని బాధపడినట్టు వెల్లడించారు. అంతేకాదు, రాజకీయాలకు అతీతంగా ఆయన అన్ని పార్టీలతో స్నేహం కొనసాగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అంతేకాదు, విరుగంపాక్కం ప్రాంత ప్రజలకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. తన హాస్యంతో ప్రజల హృదయాల్లోకి నిలిచి పోయిన ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా మైల్‌స్వామి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు గవర్నర్ వెల్లడించారు.
అటు పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు మైల్‌స్వామి ఇంటికి వెళ్లి ఆయన పార్దివదేహానికి పూల మాలలు వేసి శ్రధ్ధాంజలి ఘటిస్తున్నారు. కమల్ హాసన్, విక్రమ్ సహా పలువురు హీరోలు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు తమిళ సినీ పరిశ్రమకు తీరనిదన్నారు.
Read Also: నో పార్కింగ్‌లో హీరోగారి కారు, చలాన్ వేసిన పోలీసులు