విడుదల తేదీల విషయంలో ఓ స్పష్టత వచ్చింది. మార్చి 11న 'రాధే శ్యామ్', 25న 'ఆర్ఆర్ఆర్', ఏప్రిల్ 28న 'ఎఫ్ 3', 29న 'ఆచార్య', మే 12న 'సర్కారు వారి పాట'... భారీ సినిమాలు థియేటర్లలోకి ఎప్పుడు వచ్చేది తెలిసింది. స్టార్ హీరోలు కర్ఛీఫ్‌లు వేశారు. ఇప్పుడు యువ హీరోల వంతు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత 'ఎస్.ఆర్. కళ్యాణ మండపం'తో థియేటర్లలోకి వచ్చిన కిరణ్ అబ్బవరం, ఇప్పుడు 'సెబాస్టియన్ పీసీ 524'తో థియేటర్లలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా, టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం 'సెబాస్టియన్ పీసీ 524'. నైట్ బ్లైండ్‌నెస్ (రేచీకటి)... హీరోకు రేచీకటి ఉంటే? అతడు పోలీస్ అయితే? అనే కథాంశంతో సినిమా రూపొందింది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 25న (Sebastian PC524 On Feb 25th) విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదల చేసిన గ్లింప్స్, లుక్స్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. కిరణ్ అబ్బవరం రెండు లుక్స్‌లో కనిపించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజు (ఫిబ్రవరి 25) న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఫిబ్రవరి 25న 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా ఉంది. దానికి ఒక్క రోజు ముందు అజిత్ 'వలిమై' విడుదల కానుంది. 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1న విడుదల చేస్తామని చెప్పారు. అయితే... పవర్ స్టార్ ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రాకపోవచ్చనేది ఇన్ సైడ్ టాక్. అందుకని, ఫిబ్రవరి నెలాఖరున యువ హీరోల సినిమాలు రెడీ అవుతున్నాయి.
'సెబాస్టియన్ పీసీ 524'లో కోమలీ ప్రసాద్ (Komali Prasad) హీరోయిన్. 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు', 'అతిథి దేవో భవ' సినిమాల్లో నటించిన నువేక్ష (నమ్రతా దారేకర్) మరో హీరోయిన్. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో ప్రమోద్, రాజు చిత్రాన్ని నిర్మించారు. దీనికి జిబ్రాన్ సంగీతం అందించారు. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాజ్ కె. నల్లి, సహ నిర్మాత: సిద్దారెడ్డి బి.