Kichcha Sudeep's mother Death : కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన తల్లి సరోజా సంజీవ్ చనిపోయారు. 86 ఏళ్ల వయసున్న ఆమె గత కొద్ది రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెంగళూరు జయనగర్‌లోని అపోలోలో ఆసుపత్రిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ తెల్లవారు జామున పరిస్థితి మరింత విషమించడంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. వయో సంబంధ అనారోగ్య సమస్యలతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు. ఆమెను కాపాడేందుకు ప్రత్యేక వైద్యుల బృందం స్పెషల్ కేర్ తీసుకున్నప్పటికీ శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో చనిపోయిందన్నారు. అనంతరం ఆమె పార్దివదేహాన్ని హాస్పిటల్ నుంచి జేపీ నగర్ లోని ఇంటికి తీసుకెళ్లారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 


సరోజా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖుల సంతాపం


సరోజా సంజీవ్ చనిపోయినట్లు తెలియడంతో కన్నడ సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు సంతాపాన్ని ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. మరోవైపు సినీ పెద్దలు కిచ్చా సుదీప్ ఇంటికి వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. సుదీప్ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్తున్నారు. కన్నడ సినిమా పరిశ్రమపై ఆమెకు ఎంతో గౌరవం ఉందని సినీ ప్రముఖులు వెల్లడించారు. ఆ గౌరవంతోనే తన కుటుంబ సభ్యులను ఇండస్ట్రీలో అడుగు పెట్టేలా చేసిందని గుర్తు చేసుకుంటున్నారు.


తన తల్లి గురించి ఎంతో గొప్పగా చెప్పిన సుదీప్


కిచ్చా సుదీప్ కు తన తల్లి సరోజా అంటే ఎనలేని ప్రేమ, గౌరవం. వీలు దొరికినప్పుడల్లా ఆమె గురించి గొప్పగా చెప్పేవారు. రీసెంట్ గా బిగ్ బాస్ స్టేజి మీద కూడా తన తల్లి గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు ఆమె చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  


‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు..


కిచ్చా సుదీప్ ‘ఈగ’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, నాని హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో ఆయన విలన్ గా నటించారు. తొలి సినిమాతోనే ఆయన మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘బాహుబలి’లో ఆయుధ వ్యాపారి అస్లాం ఖాన్ గా కనిపించి ఆకట్టుకున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందినా, తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కన్నడ సినీ పరిశ్రమలో నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టీవీ యాంకర్ గా, సింగర్ గానూ రాణించారు.  గత కొంతకాలంగా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా గుర్తింపు పొందారు. 2013లో భారత్ లో టాప్ 100 ప్రముఖుల ఫోర్బ్స్ లిస్టులో ఆయన స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు.    


Read Also: ఖుబానీ కా మీఠా, వెజ్ షీక్ కబాబ్స్ - పిస్తా హౌస్​లో హైదరాబాద్ ఫుడ్ టేస్టీ చేసిన బాలీవుడ్ హీరో