ఆడీ ఇండియాకు మొదటి మహిళా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ నిలిచింది. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడీ ఒక మహిళా అంబాసిడర్‌ను నియమించుకోవడం ఇదే మొదటిసారి. దీన్ని ఆడీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రకటించింది. ‘పురోగతి, సృజనాత్మకత ఒకేచోట ఉండాలి. కియారా అలీ అద్వానీని ఆడీ ఎక్స్‌పీరియన్స్‌కు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది.’ అన్నారు.


ఇంతకుముందు ఈ బ్రాండ్‌కు ప్రమోషన్ చేసిన విరాట్ కోహ్లీ, రీగ్-జేన్‌ల సరసన కియారా కూడా చేరింది. ప్రస్తుతం మనదేశంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో కియారా అద్వానీ కూడా ఉంది. తన చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామ్ చరణ్, శంకర్‌ల సినిమాలో కూడా తనే హీరోయిన్.


ఈ సినిమాతో పాటు భూల్ భులయ్యా 2, గోవిందా నామ్ తేరా, జగ్ జగ్ జీయో చిత్రాల్లో కూడా కియారా నటిస్తుంది. 2014లో ఫగ్లీ సినిమాతో కియారా అద్వానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2016లో విడుదల అయిన ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీతో తనకు మంచి గుర్తింపు వచ్చింది.


తర్వాత భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌లో కూడా ఈ అందాల భామ అడుగుపెట్టింది. అదే సంవత్సరం వచ్చిన లస్ట్ స్టోరీస్‌తో బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత కబీర్ సింగ్, షేర్ షాలు హిట్ అవ్వడంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయంది.


తెలుగులో వినయ విధేయ రామ డిజాస్టర్ అయినా సరే.. సెంటిమెంట్‌ను కూడా పక్కనపెట్టి రామ్‌చరణ్ మళ్లీ కియారాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు లైనప్‌లో ఉండే సినిమాలు హిట్ అయితే కియారా జోరు మరిన్ని సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది.