కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'కేజీఎఫ్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సినిమాకి భారీ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన 'కేజీఎఫ్2' కూడా రికార్డులు సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ఐదొందల కోట్ల క్లబ్ లో చేరింది. ఇదిలా ఉండగా.. 'కేజీఎఫ్ చాప్టర్ 3' కూడా ఉంటుందని 'కేజీఎఫ్2' సినిమా ఎండింగ్ లో వెల్లడించారు మేకర్స్.  


చాప్టర్ 3కి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని 'కేజీఎఫ్' ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తిక్ గౌడ వెల్లడించారు. 'కేజీఎఫ్' సినిమాలు ఇంత పెద్ద సక్సెస్ కావడంలో మేజర్ క్రెడిట్ టెక్నికల్ టీమ్ కే దక్కుతుంది. ముఖ్యంగా ఎడిటింగ్, మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంది. తన బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ తో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు సంగీత దర్శకుడు రవి బస్రూర్. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ 'కేజీఎఫ్'తో స్టార్ గా మారిపోయారు.


గతంలో ప్రశాంత్ నీల్ తోనే కలిసి వర్క్ చేశారు రవి బస్రూర్. ఇప్పుడు 'కేజీఎఫ్2' సూపర్ హిట్ అవ్వడంతో ప్రతి ఒక్కరు ఆయన గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. 2020లో లాక్ డౌన్ సమయంలో రవి తన సొంతూరు ఉడిపి సమీపంలో కుందాపూర్ కు వెళ్లిపోయారు. 


అక్కడ తన తండ్రితో పాటు దేవుళ్లకు ఆభరణాలు తయారు చేశారు. అలానే కొన్ని ఆయుధాలను కూడా తయారు చేశారు. దీనికి గాను ఆయనకు రోజుకి 35 రూపాయల సంపాదన వచ్చేదట. అప్పట్లోనే వీటికి సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు రవి బస్రూర్. ఇప్పుడు మరోసారి ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. 


Also Read: ఎన్టీఆర్ కోసం అలాంటి కథనే రాశా - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు