Katrina Kaif  About Merry Christmas Movie: ‘టైగర్‌ 3’ చిత్రంలో జోయాగా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. అదిరిపోయే యాక్షన్ సీన్లతో అందరినీ అలరించింది. టవల్ ఫైట్ సహా పలు యాక్షన్ సన్నివేశాల్లో కళ్లు చెదిరిపోయేలా నటించింది. ఇక  ఆమె తాజాగా చిత్రం ‘మెరీ క్రిస్మస్‌’ విడుదలకు రెడీ అవుతోంది. ఇందులోనూ ఆమె మెస్మరైజింగ్ సాహసాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా రోడ్‌ ట్రిప్‌లు సైతం వేస్తోంది.


బైక్ నేర్చుకునేందుకు చాలా కష్టపడ్డా!


‘మెరీ క్రిస్మస్‌’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రినా, ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2024 జనవరి 12న విడుదల కాబోతున్న మూవీకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టినట్లు వెల్లడించిన ఆమె, పలు సీక్రెట్స్ వెల్లడించింది. సినిమాపై క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేసింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మోటార్‌ సైకిల్‌ రైడింగ్‌ నిర్వహించడం గురించి కూడా స్పందించింది. గతంలో తనకు బైక్ నడపడం వచ్చిది కాదని కత్రినా వెల్లడించింది. ‘జిందగీ నా మిలేగీ దొబారా’ మూవీ షూటింగ్ సమయంలో నేర్చుకున్నట్లు తెలిపింది.


ఆ మూవీ షూటింగ్ సమయంలో అర్థరాత్రి తర్వాత బైక్ తీసుకుని రోడ్ల మీదికి వచ్చేదాన్నని చెప్పింది. మొదట్లో బైక్ నేర్చుకునే టిప్స్ నేర్చుకునేందుకు స్పెయిల్ లో ట్రైనింగ్ స్కూల్ కు వెళ్లినట్లు చెప్పింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి నుంచి  యష్ రాజ్‌ స్టూడియోస్‌ వరకు రైడింగ్‌ చేసినట్లు వివరించింది. “రాత్రి సమయంలో ట్రాఫిక్ కారణంగా బైక్ సరిగ్గా నడపడం వచ్చేది కాదు. కానీ, కొద్ది రోజుల పాటు అలాగే ట్రై చేశాను. ఆ తర్వాత బైక్ నడపడం వచ్చింది. నేను బైక్ నేర్చుకునే సమయంలో నాతో పాటు ఓ వ్యక్తి ఉండేవాడు. అతడు ఎవరు అనేది మాత్రం బయటకు చెప్పను” అని తెలిపింది.


కష్టమైనా వెనుకడుగు వేయలేదు!                 


ఇక ‘టైగర్‌ 3’లో జోయాగా భారీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్న కత్రినా, ఈ సినిమాలోనూ అలాంటి సన్నీవేశాలతో ఆడియెన్స్​ను అలరించబోతున్నట్లు తెలిపింది. యాక్షన్‌ సన్నివేశాల కోసం ఎంతో రిస్క్ తీసుకున్నట్లు వెల్లడించింది.  ఆ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టం అనిపించినా, ఎక్కడా వెనక్కి తగ్గలేదని వెల్లడించింది. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర తనకే కొత్తగా అనిపించిందని వెల్లడించింది.


మెరీ క్రిస్మస్‌’తో ఆ కోరిక తీరింది!


ఇక వైవిధ్యమైన, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలో నటించాలనే తన కోరిక ‘మెరీ క్రిస్మస్‌’ సినిమాతో నెరవేరిందని కత్రినా తెలిపింది. డైరెక్టర్ శ్రీ రామ్‌ రాఘవన్‌ తోనూ సినిమా చేయాలనే కోరిక తీరిందని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి నటించడం  అద్భుతం అనిపించిందని వివరించింది. ఆయన నటనలో ఎన్నో కోణాలు ఉన్నాయని వెల్లడించింది. ఇక ‘మెరీ క్రిస్మస్‌’ మూవీ హిందీ, తమిళ భాషల్లో విడుదలకానుంది. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్